‘టెట్‌’ కష్టాలు!

13 Feb, 2018 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు

హాల్‌ టికెట్లు కనిపించక కంగారు 

మహిళా అభ్యర్థినులకు అవస్థలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాయదుర్గానికి చెందిన ఎం. అలేఖ్య టెట్‌ పేపర్‌–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అమ్మాయికి ఒంగోలులో టెట్‌ కేంద్రం వేశారు. తండ్రి రమణ ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్నారు. ఆయన కూతురును తీసుకుని ఒంగోలుకు వెళ్లి పరీక్ష రాయించాలంటే రెండు రోజులు సెలవు పెట్టాలి. పైగా వేలాది రూపాయలు ఖర్చు.

అనంతపురం నగరానికి చెందిన బి.మదన ప్రతాప్‌రెడ్డి పేపర్‌–1 పరీక్షకు దరఖాస్తు చేశాడు. దరఖాస్తు సమయంలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఆప్షన్‌ ఇచ్చారు. కానీ ఇవేవీ లేకుండా బెంగళూరు నగరంలో కేంద్రం వేశారు.  
యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన కేతిరెడ్డి ప్రతాప్‌రెడ్డి అనే అభ్యర్థి టెట్‌ పేపర్‌–2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌  కనిపించడం లేదు. పుట్టినరోజు, దరఖాస్తు ఐడీ నంబరు, ఆధార్‌నంబరు నమోదు చేసినా ‘డిటైల్స్‌ నాట్‌ఫౌండ్‌) అని వస్తోంది. దీంతో ప్రతాప్‌రెడ్డి ఆందోళన చెందుతున్నాడు.  
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్షను తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 1వ తేదీ వరకు  టెట్‌ 1, 2, 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసలే ఆన్‌లైన్‌పై అవగాహన లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే... సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలు కేటాయించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరు తమ హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని వాపోతున్నారు. రాయదుర్గం పట్టణంలోనే సుమారు వందమంది అభ్యర్థులు పేపర్‌–1, 2, 3 పరీక్షలు రాస్తుంటే వీరిలో 80 మందికిపైగా  కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కేంద్రాలు వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మహిళా అభ్యర్థినులకు తప్పని ఇక్కట్లు
సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు పడిన మహిళా అభ్యర్థినులు తీవ్ర ఇక్కట్లు పడనున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులు ప్రయాణ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. దీనికితోడు ఖర్చు కూడా భారీగా వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలతో పాటు మన రాష్ట్రంలో సుదూర ప్రాంతాల్లో కేంద్రాలకు మహిళా అభ్యర్థులు వెళ్లాలంటే కచ్చితంగా తోడుగా కుటుంబీకులను తీసుకెళ్లాలి. అందులోనూ ముందు రోజు వెళ్లాల్సి ఉంటుంది. పోను,రాను ప్రయాణం, భోజన, వసతి ఖర్చులన్నీ కలిపితే వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇవన్నీ తలచుకుని ఆర్థిక ఇబ్బందులున్న కొందరు పరీక్ష రాసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. కాగా టెట్‌ నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. హాల్‌టికెట్లు రాని కొందరు ఇక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. 

మరిన్ని వార్తలు