విద్యుత్‌ స్తంభం పైనుంచి పడి యువకుడి మృతి

10 Nov, 2023 05:32 IST|Sakshi
విజేత ట్రోఫీని అందుకుంటున్న ఆర్ట్స్‌ కళాశాల జట్టు

బొమ్మనహాళ్‌: విద్యుత్‌ స్తంభం పైనుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లుకు చెందిన కె.ఎర్రిస్వామి(30)కి భార్య గంగమ్మతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఖాళీ సమయంలో గ్రామంలోని విద్యుత్‌ సమస్యలు తలెత్తినప్పుడు మరమ్మతు పనుల్లో పాలుపంచుకునేవాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం హనుమంతరాయ ఇంటికి సర్వీసు వైర్‌ మార్చేందుకు ఎల్‌సీ తీసుకోకుండానే విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎర్రిస్వామి... షాక్‌కు గురై కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తీసుకెళ్లగా... చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

బాల్‌బ్యాడ్మింటన్‌ జిల్లా కార్యవర్గం ఎంపిక

అనంతపురం: జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నాలుగు సంవత్సరాల కాల వ్యవధి గల ఈ కార్యవర్గాన్ని గురువారం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా బి. బుగ్గయ్య చౌదరి (అనంతపురం), ఉపాధ్యక్షులుగా కె.మహమ్మద్‌ షఫీ, షేక్‌ దాదా ఖలందర్‌, (గుంతకల్లు), ప్రధాన కార్యదర్శిగా జయకుమార్‌ (గుంతకల్లు), కోశాధికారిగా పి.సాంబమూర్తి (అనంతపురం), సహ కార్యదర్శులుగా షేక్‌అబ్దుల్‌ అజీజ్‌ (గుంతకల్లు), ఎం.జీవన్‌ కుమార్‌(అనంతపురం), పులి ప్రతాప్‌ (అనంతపురం)ను ఎంపిక చేసినట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (న్యాయవాది) ఎ.సురేష్‌ కుమార్‌ వెల్లడించారు.

క్రీడాపోటీల్లో ఆర్ట్స్‌ కళాశాల ప్రభంజనం

అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన ఎస్కేయూ అంతర కళాశాలల గ్రూప్‌–ఏ క్రీడా పోటీల్లో అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల జట్టు ప్రభంజనం సృష్టించింది. బాల్‌ బ్మాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో విజేత ట్రోఫీలను దక్కించుకున్న ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులు హ్యాండ్‌బాల్‌లో రన్నరప్‌ను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఎస్కేయూ స్పోర్ట్స్‌ సెక్రెటరీ డాక్టర్‌ ఎంవీ శ్రీనివాసన్‌, పీడీ జబీవుల్లా అభినందించారు.

కురుబల అనుమానాలు నివృత్తి చేయండి

బత్తలపల్లి: కనకదాసు కల్యాణ మంటపం నిర్వహణ ఆర్థిక లావాదేవీలను పత్రికాముఖంగా వెల్లడి చేయాలని అనంతపురం జిల్లా కురుబ సంఘం మాజీ అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులును ఏపీ కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌బాబు నివాసంలో కురుబ సంఘం నాయకులు నిలదీశారు. త్వరలో అనంతపురంలో జరిగే గుడికట్ల సంబరాలకు ఆహ్వానించేందుకు గురువారం కోటి బాబు ఇంటికి శ్రీనివాసులు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలోని కురుబ సంఘం నాయకులు అక్కడికి చేరుకుని, కల్యాణ మంటపం ఆర్థిక వ్యవహారాలను వెల్లడించాలని పట్టుబట్టారు. ఏళ్లుగా కల్యాణమంటపం నిర్వహణను శ్రీనివాసులు చూస్తూ ఏ ఒక్కరికీ లావాదేవీలను వెల్లడించకపోవడాన్ని తప్పుబట్టారు. అదే సమయంలో కోటి సూర్యప్రకాష్‌బాబు జోక్యం చేసుకుని కల్యాణమంటపం ఆర్థిక లావాదేవీలను పత్రికా ముఖంగా వెల్లడిస్తూ కుల పెద్దల్లోని అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. దీంతో శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు