జిల్లాకే అగ్రభాగం!

10 Nov, 2023 05:32 IST|Sakshi
రాగులపాడు లిఫ్ట్‌ వద్ద నీటిని పంపింగ్‌ చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

అనంతపురం సెంట్రల్‌: కృష్ణాజలాల వినియోగంలో ఉమ్మడి అనంత జిల్లాకే అత్యధిక ప్రాధాన్యత దక్కింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 40 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని భావించి రాయలసీమ జిల్లాలోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీటిని అందించేలా హంద్రీ–నీవా పథకాన్ని చేపట్టారు. ఇప్పటి వరకూ శ్రీశైలం జలాశయం నుంచి 10.675 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా అందివ్వగా అందులో 7.791 టీఎంసీలు జిల్లాలో తాగునీటి అవసరాలకు వినియోగించారు. అధికారులు వారా బందీ పద్ధతిని అవలంబిస్తూ అన్ని ప్రాంతాలకూ సమంగా నీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 2004కు ముందు కేవలం తాగునీటి ప్రాజెక్టుగా ఉన్న హంద్రీ–నీవా... దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సమూల మార్పులు చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మొదటి దశ పనులు పూర్తి చేయడంతో పాటు రెండో దశ పనులనూ దాదాపు 60శాతం పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మహానేత చలవతో గత పదేళ్లకు పైగా రాయలసీమ జిల్లాల్లో కరువు ఛాయలు దాదాపు కనుమరుగయ్యాయి.

చిత్తూరుకు ఇప్పటి వరకూ 0.10 టీఎంసీలు..

హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా అందుతున్న నీటి లభ్యతను బట్టి రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సమంగా నీటి పంపిణీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో ఏ జిల్లాకు ఎంత వాటా అన్నది నిర్ణయించి, ఆ మేరకు నీటి పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు ఈ ఏడాది 2.481 టీఎంసీలు కేటాయించగా ఇప్పటి వరకూ 0.1094 టీఎంసీల నీటిని అందజేశారు. ఉమ్మడి అనంత జిల్లాలో నీటి అవసరాలను బట్టి ఎక్కువ నీటిని రైతులు వాడుకోసాగారు. దీంతో దిగువకు నీరు వెళ్లే అవకాశం లేక యుద్ధప్రాతిపదికన వారాబందీ పద్దతిని ప్రవేశపెట్టి ఓ వైపు అనంతలో పంటలు కాపాడుతూనే మరో వైపు అన్ని ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం కృష్ణాజలాలను మళ్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలను అంట గడుతూ పచ్చపత్రిక అసత్య కథనాలను ప్రచురించడాన్ని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు తప్పు బడుతున్నారు.

వర్షాభావంతో గడ్డు పరిస్థితులు..

గత నాలుగేళ్లుగా కళకళలాడిన శ్రీశైలం జలాశయం ఈ ఏడాది తీవ్ర వర్షాభావాన్ని చవిచూస్తోంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో చెప్పుకోదగ్గ వర్షాలు ఈ ఏడాది కురవకపోవడమే ఇందుకు కారణం. దీంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి గడ్డు పరిస్థితులు ఎదురైనా ఉమ్మడి అనంతపురం జిల్లాకు పుష్కలంగా కృష్ణా జలాలు అందాయి. ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి హంద్రీ–నీవాకు కర్నూలు జిల్లా మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి నీటిని ఎత్తిపోయడం మొదలు పెట్టారు. జిల్లా సరిహద్దుకు అదే నెల 21 నాటికి కృష్ణాజలాలు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ మల్యాల పంప్‌హౌస్‌ వద్ద 10.675 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. జిల్లా సరిహద్దులో 7.900 టీఎంసీలు రాగా... జీడిపల్లి జలాశయానికి 4.044 టీఎంసీలు చేరింది. సాగునీటి సలహామండలి సమావేశం తీర్మానం మేరకు అన్ని ప్రాంతాలకూ సమంగా నీటి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వారాబందీ(ఆన్‌అండ్‌ఆఫ్‌) పద్దతి ప్రకారం హంద్రీనీవా–2 ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు.

కృష్ణా జలాల వినియోగంలో

ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత

ఇప్పటి వరకూ హంద్రీనీవాకు

10.67 టీఎంసీల నీరు

జిల్లాకే అత్యధిక ప్రాధాన్యత

ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో శ్రీశైలం జలాశయానికి నీరు చేరలేదు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకునేలా తొలి నుంచి కృషి చేస్తున్నాం. అలాగే నీటి వృథా అరికట్టి అన్ని ప్రాంతాలకూ సమంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకూ శ్రీశైలం జలాశయం నుంచి 10.675 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా అనంత జిల్లాకు 7.791 టీఎంసీలు వినియోగించుకున్నాం. ప్రధాన కాలువపై ఆధారపడి సాగు చేసిన పంటలను కాపాడేందుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ ద్వారా నీటిని అందిస్తున్నాం. ఇందులో ఎక్కడా రాజకీయం లేదు. ప్రజాప్రతినిధులు కూడా పంటలను కాపాడేందుకు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరిస్తున్నారు. వారి చొరవ వల్లనే నీటి పంపిణీ పకడ్బందీగా జరుగుతోంది. – దేశేనాయక్‌, ఎస్‌ఈ,

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం

మరిన్ని వార్తలు