ఐ మిస్‌ యూ

31 Dec, 2017 08:12 IST|Sakshi

చనిపోతున్నానంటూ మొబైల్, ఫేస్‌బుక్‌ ద్వారా మెసేజ్‌

లాడ్జి గదిలో పురుగుమందు తాగి.. ఉరేసుకున్న యువకుడు

అనంతపురం : రెండు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు పాడెక్కాడు. అతడికి ఏ కష్టం వచ్చిందో తెలీదు. ‘ఐ మిస్‌ యూ’ అంటూ మెసేజ్‌ పంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే.. యాడికి మండలం చందన గ్రామానికి చెందిన సూర్యనారాయణ, అమ్మణ్ణి దంపతుల కుమారుడు గోవర్ధన్‌గౌడ్‌ (24) తాడిపత్రి సమీపంలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. బట్టతల కలిగిన ఇతను పెళ్లిలోపు హెయిర్‌ ప్లాంటేషన్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బట్టలు సర్దుకుని అనంతపురంలో చికిత్స చేయించుకునేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. 

అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తన సెల్‌ నుంచి బంధువులు, స్నేహితులకు  ‘ఐ మిస్‌ యూ.. ఐ మిస్‌ యూ’ నేను చనిపోతున్నా అంటూ మెసేజ్‌ పెట్టాడు. ఫేస్‌ బుక్‌లోనూ పోస్ట్‌ చేశాడు. అప్రమత్తమైన బంధువులు, స్నేహితులు గోవర్ధన్‌గౌడ్‌ కోసం గాలింపు చేపట్టారు. అనంతపురం నగరంలో అన్ని లాడ్జీల్లోనూ విచారణ చేశారు. చివరగా బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఆచూకీ దొరికింది. గదిలో గడియ పెట్టుకుని పురుగుమందు తాగిన అనంతరం తాడుతో ఉరివేసుకుని ఉన్న గోవర్ధన్‌గౌడ్‌ను గుర్తించారు. శనివారం స్వగ్రామానికి చేరుకున్న మృతదేహాన్ని చూసి గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read latest Ananthapur News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు