పొట్టపై 100 రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు

29 Aug, 2016 04:10 IST|Sakshi
పొట్టపై 100 రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు

గిన్నిస్ రికార్డు కోసం యువకుడి సాహసం
 
 రాజమహేంద్రవరం సిటీ: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఓ యువకుడు చేసిన సాహసం వీక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. నగరానికి చెందిన కొమ్మ ఉజ్వల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్లను పొట్టపై ఎక్కించుకున్నాడు. ఇప్పటికే కరాటే, కుంగ్‌ఫూ, బాక్సింగ్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన అతడు గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం గిన్నిస్ బుక్ ప్రతినిధులను సంప్రదించాడు. 250 కేజీల బరువైన 10 వాహనాలను పొట్టపై నుంచి ఎక్కించుకుంటే గిన్నిస్ రికార్డు సాధించవచ్చని తెలిపారు.

గెజిటెడ్ హోదా కలిగిన డాక్టర్ల సమక్షంలో సాహస కార్యాన్ని వీడియో తీసి పంపాలని వారు ఉజ్వల్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రమేష్ కిశోర్, డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు, డాక్టర్ ఎంవీఆర్ మూర్తిలు సాహస విన్యాసానికి ఎంచుకున్న విధానాన్ని పరిశీలించిన అనంతరం అనుమతి ఇచ్చారు. దీంతో ఉజ్వల్ ఆదివారం మొదటి విడతగా 10 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లను పొట్టపై నుంచి ఎక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారం రెండు నిమిషాల విరామాన్ని మూడుసార్లు తీసుకున్నాడు. మొత్తంగా 10 మోటార్ సైకిళ్లు 10 రౌండ్లుగా తిరగడంతో మొత్తం 100 మోటార్ సైకిళ్లను పొట్టపై ఎక్కించుకున్నట్టయింది. నగర మేయర్ పంతం రజనీ శేషసాయి వాహనాలకు జెండా ఊపి సాహస విన్యాసాన్ని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు