పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

23 Jan, 2016 20:15 IST|Sakshi

కంచికచర్ల (కృష్ణా జిల్లా) : మానసిక ఆందోళనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం కృష్ణా జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కంచికచర్లలోని గౌతమి పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న వెలగా వినయ్‌ కుమార్ (15) శుక్రవారం అర్ధరాత్రి తాను ఉంటున్న పెంకుటింటిలోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన వెలగా నర్సయ్య, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. నర్సయ్య వ్యవసాయంతోపాటు బ్రాందీషాపులో పనిచేస్తుంటాడు. పెద్దకుమారుడు వినయ్ గౌతమి పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడడంతో విద్యార్థులందరూ శుక్రవారం రాత్రి 11గంటలకు వరకు చదువుకున్నారు. అర్ధరాత్రి వినయ్ బయటకు వచ్చి గదికి గడియపెట్టి వరండాలోని దూలానికి ఉరి వేసుకున్నాడు.

తెల్లవారుజాము 5.30 గంటలకు గది లోపల ఉన్న తోటి విద్యార్థులు తలుపులు తీసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో కిటికీలో నుంచి బయటకు తొంగిచూశారు. అప్పటికే దూలానికి వేలాడుతున్న వినయ్‌కుమార్‌ను చూసి కేకలు వేసి సమీపంలో ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ అబ్బూరి నాగేశ్వరరావుకు తెలియజేశారు. ఆయన పరుగున వచ్చి గది గడియ తీసి విద్యార్థులను బయటకురమ్మని, దూలానికి వేలాడుతున్న వినయ్‌ను కిందికి దించి వైద్యం నిమిత్తం స్థానిక ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి సుమారు 3 గంటల క్రితమే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

ఈ విషయం తెలుసుకున్న వీరులపాడు ఎస్‌ఐ ఐ.అవినాష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న వినయ్‌కుమార్ తల్లిదండ్రులతో పాటు బంధువులు మోగులూరు నుంచి కంచికచర్లకు చేరుకుని ఆస్పత్రిలో విగతజీవిగా పడివున్న కుమారుడిని చూపి కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు