సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ 20 వేల కోట్లు

3 Dec, 2018 04:23 IST|Sakshi

చంద్రబాబు పాలనలో నింగి, నేల హద్దుగా అవినీతి

600 మంది రూ.500 కోట్ల చొప్పున అక్రమంగా ఆర్జించారు 

50 మంది రూ.100 కోట్లు, మరో 50 మంది రూ.50 కోట్ల చొప్పున దోచుకున్నారు 

ఇసుక నుంచి మట్టి వరకూ అంతా దోపిడే 

కాంట్రాక్టులన్నీ నవయుగ, మేఘా, కావూరి, రాయపాటి, సీఎం రమేష్‌ కంపెనీలకే.. 

వైఎస్‌కు పేరు వస్తుందనే పులిచింతల ప్రాజెక్టును పూర్తిచేయడం లేదు 

సైబరాబాద్‌ పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకున్నారు.. సైబరాబాద్‌ను తామే నిర్మించామని ప్రచారం చేసుకుంటున్నారు  

సైబర్‌ టవర్స్‌ అభివృద్ధికి ఆద్యులు పీవీ, నేదురుమల్లినే... 

ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లాగా కొనేశారు 

జన చైతన్య వేదిక ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో మాజీ సీఎస్‌ అజేయ కల్లం 

ఎమ్మెల్యేల కొనుగోలుకు అసెంబ్లీ నిలయం

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి, అవినీతి లేకుండా ఏ పనీ కావడం లేదు  

రిటైర్డు డీజీపీ ఆంజనేయరెడ్డి ధ్వజం 

‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద బాస్‌కు (సీఎం) భారీగా కమీషన్‌ అందుతోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేసిన నిధుల్లో ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అధికార పార్టీ నేతలు 40 శాతం మేర కమీషన్‌ దండుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం గత నాలుగున్నరేళ్లలో ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతున్న రూ.50,000 కోట్లలోనే ఏకంగా రూ.20,000 కోట్ల అవినీతి జరిగింది. 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏకంగా రూ.20,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అజేయ కల్లం సంచలన ఆరోపణలు చేశారు. దీంతోపాటు మొత్తం రూ.3 లక్షల కోట్లకుపైగా అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నింగి, నేల హద్దుగా అవినీతి పెచ్చుమీరుతోందని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, ఇసుక, మట్టి, ఫైబర్‌ గ్రిడ్, నీరు–చెట్టు, నీటి కుంటలు, రెయిన్‌ గన్‌లు.. ఇలా ప్రతిదాంట్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 600 మంది ఒక్కొక్కరు రూ.500 కోట్లకుపైగా సంపాదించారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా 50 మంది రూ.100 కోట్లకుపైగా, మరో 50 మంది రూ.50 కోట్లకుపైగా అక్రమంగా ఆర్జించారని చెప్పారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో నిర్వహించిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సుకు అజేయ కల్లం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... 

కమీషన్ల కోసమే ప్రైవేట్‌ కరెంటు కొనుగోళ్లు 
రాష్టంలో చేపడుతున్న కాంట్రాక్టులన్నీ కేవలం కొన్ని కంపెనీలకు... నవయుగ, మేఘా, కావూరి, రాయపాటి, సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలకు మాత్రమే అప్పగిస్తున్నారు. వీరు ఎక్కడా పనులు చేయడం లేదు. సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నేరుగా 8 శాతం వరకు కమీషన్లు మింగేస్తున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు, సెల్‌ఫోన్ల కొనుగోళ్లలోనూ భారీగా అవినీతి జరిగింది. ఇక నీరు–చెట్టు పథకం కింద రూ.10 లక్షల విలువైన పనులే కాకుండా.. రెండు పనులు కలిపి మొత్తం రూ.20 లక్షల పనులను కూడా నామినేషన్‌ విధానంలో కావాల్సిన వారికి అప్పగిస్తున్నారు. ఈ పనుల్లో లెక్కలేనంత అవినీతి చోటుచేసుకుంది. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలోని జెన్‌కో ప్లాంట్లలో గతంలో 90 శాతం ప్లాంట్లు ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌)తో నడిచేవి. ఇప్పుడు కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీల నుంచి కరెంటును కొనుగోలు చేస్తుండటంతో జెన్‌కో ప్లాంట్ల పీఎల్‌ఎఫ్‌ 50 శాతానికి పడిపోయింది. 

స్పీకర్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించారు 
23 మంది విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లాగా కొనుగోలు చేసి స్పీకర్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. గ్రామ పంచాయతీకి దక్కాల్సిన ఇసుకను దోపిడీ చేసి సంపాదించిన సొమ్ముతో రూ.2 వేలు, రూ.5 వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటామనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక నుంచి మట్టి వరకు అన్ని  పనుల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. నీరు–చెట్టు కింద పనులు చేయకున్నా బిల్లులు మాత్రం చేసుకుంటున్నారు. ఇక నీటి కుంటలు(ఫారం పాండ్స్‌) తవ్వకపోయినప్పటికీ తవ్వినట్టుగా లెక్కలు చూపుతున్నారు. ఈ విధంగా 600 మంది రూ.500 కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారు. 50 మంది రూ.100 కోట్లకుపైగా, మరో 50 మంది రూ.50 కోట్లకుపైగా సంపాదించినట్టు తెలుస్తోంది. అంటే కేవలం 600 మంది రూ.500 కోట్ల చొప్పున లెక్కిస్తే ఏకంగా రూ.3 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడి ఆర్జించినట్టు స్పష్టమవుతోంది. 

ఫైబర్‌ లేదు.. గ్రిడ్‌ లేదు 
రాష్ట్రంలో చివరకు సెల్‌ఫోన్ల కొనుగోళ్లలోనూ అవినీతి జరుగుతోంది. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెబితే.. మేమే చేపడతామని రూ.400 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఎక్కడా కనిపించడం లేదు. ఫైబర్‌ లేదు.. గ్రిడ్‌ లేదు. మార్కెట్‌లో కేవలం రూ.2,000కు దొరికే సెట్‌టాప్‌ బాక్సులను రూ.4,000కు అమ్ముతున్నారన్నారు. ఇలా ఏ రంగంలో చూసినా అవినీతే సాక్షాత్కరిస్తోంది. 

జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు  
ఆంధ్రప్రదేశ్‌లో నింగి, నేల హద్దుగా అవినీతి పెరిగిపోయింది. ఏమిటీ అవినీతి అని ప్రశ్నిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. సేవ చేయడం కాకుండా దోచుకోవడమే పని అనేవాడు కార్యకర్త ఎలా అవుతాడు? ప్రోటోకాల్‌ రూపంలో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, అధికారులు చేసే ఖర్చుకు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదింతలు ఖర్చు పెడుతున్నారు. ఒకవైపు లోటు బడ్జెట్‌ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టింది. దేశంలోనే అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన ఎన్నికగా ఈ ఉప ఎన్నికలు గుర్తింపు పొందాయి. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా? నీతిమాలిన రాజకీయాల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

వైఎస్‌కు పేరు రాకూడదనే... 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తయ్యింది. అయితే నేటికి ప్రాజెక్టులో నీళ్లు నింపుకోవడానికి వీలు కావడం లేదు. ఇక్కడ భూసేకరణ కోసం తెలంగాణ రైతులకు రూ.200 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం చెల్లిస్తే తమకేమి వాటా రాదని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే కాలయాపన చేస్తున్నారు. 

దోపిడీలో ఇక వారసుల వంతు 
ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వెధవలైనా మంత్రులవుతున్నారు. కనీసం సర్పంచ్‌ కాకున్నా, ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయిన, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అవుతున్నారు. అందులో భాగంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కిడారి శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 25–30 మంది టీడీపీ నాయకుల వారసులు రాజకీయాల్లో రాబోతున్నారు. ఇప్పటికే నాన్నలు రాష్ట్రాన్ని దోచేశారు. ఇప్పుడు వారసులు కూడా వచ్చి దోచేయడమే పనిగా పెట్టకుంటారు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి లాంటి త్యాగధనులను సమాజం హీరోలుగా గుర్తించాలి. 

ఏపీలో అత్యున్నత విద్యాసంస్థలేవీ? 
1980కి ముందే హైదరాబాద్‌ గణనీయంగా అభివృద్ధి చెందింది. పీవీ నరసింహారావు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిల హయాంలోనే సైబర్స్‌ టవర్స్‌ కోసం పదెకరాల భూమి, రూ.4.5 కోట్లు కేటాయించారు. తరువాత వచ్చిన కొందరు నాయకులు దాని చుట్టూ భూములు కొనుగోలు చేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ సైబరాబాద్‌ తామే నిర్మించినట్లు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ప్రపంచంలోని అత్యున్నత 1,000 విద్యా సంస్థల్లో ఏపీలో ఒక్కటి కూడా లేదు. నేను 1970ల్లో బాపట్లలో అగ్రికల్చర్‌ చదువుతున్న సమయంలో మైక్రో ఇరిగేషన్‌ కింద రెయిన్‌గన్ల గురించి విన్నాను. ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా రైతులకు కూడా 1994ల్లో చూపించాం. ఇప్పటి పాలకులు తామే కొత్తగా రెయిన్‌గన్లను కనుగొన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాటి కొనుగోళ్లల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ రెయిన్‌గన్లు ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదు. 

వ్యవస్థలన్నీ కుప్పకూలాయి 
అసెంబ్లీలో గతంలో ప్రతిపక్ష నేతలు చెప్పే మాటలకు ఎంతో విలువ ఇచ్చేవారని రిటైర్డు డీజీపీ ఆంజనేయరెడ్డి గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనీసం మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో ఆంజనేయరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు, విక్రయాలకు అసెంబ్లీ నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులను అక్కడ మాట్లాడనీయకపోవడంతో రోడ్లపైన అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చెప్పినప్పటికీ కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చేపట్టడం దారుణమన్నారు. ఒక విపక్ష ఎమ్మెల్యేను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ఇందులో గవర్నర్, కోర్టులు ఎందుకు మౌనంగా ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, అయితే, ఏపీలో మాత్రం మీడియా మాఫియాతో అ పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. ఏపీలో కుల ప్రతిపాదికన రాజకీయాలు నడుస్తున్నాయని, ఇందుకు పాలక పక్షమే కారణమని ఆరోపించారు. రాజధానికి దొనకొండ అనుకూలమైన ప్రాంతమని శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఇచ్చినా, దానిని పక్కనబెట్టి వరద, సునామీలు వచ్చే ప్రాంతమైన అమరావతిని ఎంపిక చేసి సారంతమైన 30 వేల ఎకరాల భూములను బీడుగా మార్చారని విమర్శించారు. అక్కడ అన్ని తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు 
ఏపీలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని, అవినీతి లేకుండా ఏ పనీ కావడం లేదని ఆంజనేయరెడ్డి మండిపడ్డారు. మానవ వనరుల సూచికలో ఏపీ 27వ స్థానంలో ఉందన్నారు. ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత పాలకులకే దక్కుతుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు కుదేలయ్యాయని... ఆయా రంగాల్లో సమూల మార్పులను తేవాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ బ్రహ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. సిద్దేశ్వరం అలుగును నిర్మించని వారికి పాలించే హక్కు లేదన్నారు. మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మార్పునకు నాంది పలకాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ తహసీల్దార్‌ రోషన్‌ అలీ, అజయ్‌కుమార్, కేవీ సుబ్బారెడ్డి, రవీంద్ర సుబ్బయ్య, డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

- నేను 1970ల్లో బాపట్లలో అగ్రికల్చర్‌ చదువుతున్న సమయంలో మైక్రో ఇరిగేషన్‌ కింద రెయిన్‌గన్ల గురించి విన్నాను. ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా రైతులకు కూడా 1994ల్లో చూపించాం. ఇప్పటి పాలకులు తామే కొత్తగా రెయిన్‌గన్లను కనుగొన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాటి కొనుగోళ్లల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ రెయిన్‌గన్లు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. 
- ఏమిటీ అవినీతి అని ప్రశ్నిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. 
- లోటు బడ్జెట్‌ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో, ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టింది. ఇలాంటి నీతిమాలిన రాజకీయాల నుంచి మనం బయట పడాలి.
- ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వెధవలైనా మంత్రులవుతున్నారు. కనీసం సర్పంచ్‌ కాకున్నా, ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయినా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అవుతున్నారు. 

మరిన్ని వార్తలు