నిండా ముంచిన ‘369 క్యాబ్స్‌’

29 Apr, 2019 12:16 IST|Sakshi
విలేకరుల సమావేశంలో పాల్గొన్న ట్రావెల్స్‌ నిర్వాహకులు, కార్ల యజమానులు

ఎక్కువ అద్దె రేటుతో ఎర

కార్లు ఇచ్చినవారికి తొంటిచెయ్యి

తూర్పుగోదావరి, అనపర్తి: ఎక్కువ అద్దె రేటు ఆశచూపి పలువురి నించి కార్లను తీసుకున్న ‘369 క్యాబ్స్‌’ నిర్వాహకులు వారిని నిండా ముంచారు. అద్దె చెల్లించక, వారి కార్లను ఇతర ప్రాంతాలకు తరలించి తనఖాలు పెట్టి వారిని నానా అవస్థలు పెట్టారు. విశాఖపట్నంలో ప్రారంభమైన ఈఅద్దె కార్ల బాగోతం అనపర్తికి చేరుకుంది. విశాఖపట్నానికి చెందిన ట్రావెల్‌ నిర్వాహకులు ఆదివారం అనపర్తి ప్రెస్‌ క్లబ్‌లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అడపా ప్రసాద్, అతని మిత్రులు కుమార్, కిషోర్, రాము తదితరులు 2018 జనవరిలో విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్‌–2లో ‘369 క్యాబ్స్‌’ పేరుతో కార్యాలయం ప్రారంభించి అద్దె ప్రాతిపదికన కార్లు సరఫరా చేస్తామన్నారు. విశాఖ వ్యాప్తంగా ప్రతీ నెల అద్దె చెల్లించే విధంగా వారు కార్లను లీజుకు తీసుకున్నారని మురళీప్రియ ట్రావెల్స్‌ అధినేత ఎన్‌.వెంకటేష్‌ తెలిపారు. అలా తమ వద్ద అద్దెకు తీసుకున్న కార్లను రియల్‌ఎస్టేట్, ఎంఎన్‌సీ కంపెనీలు, సంస్థలకు సరఫరా చేసి నెలవారీ అద్దెలు క్రమబద్ధంగా చెల్లిస్తామని నమ్మబలికారని తెలిపారు. ఎక్కువ అద్దెలు చెల్లిస్తామని ఆశచూపారని తెలిపారు. దాంతో పలువురు బ్యాంకు రుణాలు తీసుకొని మరీ కార్లు కొనుగోలు చేసి వారికి అప్పగించారన్నారు.

ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యవర్తుల సహాయంతో సుమారు 400 కార్లకుపైగా ‘369 క్యాబ్‌’ ప్రతినిధులు సేకరించారన్నారు. వారు రెండు నెలల పాటు సక్రమంగానే కారు అద్దెలు చెల్లించి ఆతర్వాత చెల్లించలేదని,  కార్ల కోసం సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. దాంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ‘369 క్యాబ్స్‌’ అద్దెకు తీసుకున్న కార్లు అనపర్తి, పరిసర గ్రామాల్లోనే తిరుగుతున్నాయని తెలియడంతో ఆయా గ్రామాలకు వచ్చి విచారించగా ట్రావెల్స్, కార్ల యజమానుల నుంచి అద్దెకు తీసుకున్న కార్లను అడపా ప్రసాద్, తదితరులు ఇతరులకు తాకట్టుపెట్టినట్టు తెలిసిందన్నారు. దీనిపై అడపా ప్రసాద్‌ను తాము ప్రశ్నించగా తప్పుడు కేసులు బనాయించి తమను జైల్లో పెట్టించారని ‘ఓపెల్‌ క్యాబ్స్‌’ నిర్వాహకుడు ఎల్‌.గణపతి వాపోయారు. ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేయగా మిగిలిన కార్లను రికవరీ చేయాల్సి ఉందన్నారు. తమ ట్రావెల్స్‌ ద్వారా, బయట వ్యక్తుల నుంచి తాము హామీ ఉండి తీసుకున్న కార్లకు నెలవారీ అద్దెలు చెల్లించక, బ్యాంకు వాయిదాలు బకాయి పడడంతో వారి నుండి ఒత్తిళ్లు అధికమవుతున్నాయని తెలిపారు. దీంతో భార్య, బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం తప్ప వేరే మార్గం కనబడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు, ఫైనాన్సర్లు  స్పందించి తమ కార్లను తమకు అప్పగించాలని వారు విజ్ఞప్తి చేశారు. కారు యాజమానులు, క్యాబ్స్‌ నిర్వాహకులు పి.సురేష్, పి.వంశీ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు