9,632 హెక్టార్లలో పంటల నష్టం

29 Oct, 2013 03:05 IST|Sakshi

చేవెళ్ల, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో 9,632 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విజయకుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని కేసారంలో ఎమ్మెల్యే రత్నం, ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి తదితర అధికారులతో కలిసి వర్షాలతో నష్టపోయిన క్యారెట్, పత్తి పంటలను పరిశీలించారు. రైతు సుజాతను నష్టం వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలోనే జేడీఏ విజయకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాల కారణంగా మొక్కజొన్న, పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 9,632 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు.
 
 ఇందులో పత్తి 2,751 హెక్టార్లలో, వరి 3,587 హెక్టార్లలో, మొక్కజొన్న 2,272 హెక్టార్లలో నష్టపోయినట్లు అంచనా వేశామని పేర్కొన్నారు. జిల్లాలో 2లక్షల 965 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం కాగా, ఈ ఖరీఫ్‌లో దానికంటే అధికంగా 2 లక్షల 12 వేల హెక్టార్లలో పంటలు రైతులు సాగుచేశారని స్పష్టం చేశారు. పత్తి 55వేల హెక్టార్లు, మొక్కజొన్న 45వేల హెక్టార్లు, కందిపంట 32వేల హెక్టార్లు, వరిపంట 22వేల హెక్టార్లలో సాగు చేసినట్లు వివరించారు.
 
 అక్టోబరు మాసంలో సాధారణం వర్షపాతం జిల్లాలో 97 మిల్లీమీటర్లుండగా, 187 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వ్యవసాయాధికారులు మరోసారి గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పూర్తి వివ రాలను వారంరోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలి పారు. పంటలను పరిశీలించినవారిలో చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఏడీఏ దేవ్‌కుమార్, ఏఓలు విజయభారతి, సంజయ్, ఏఈఓ లు విజయభారతి, రాఘవేందర్, టీడీపీ జిల్లా అధికా ర ప్రతినిధి ఎస్.వసంతం, దామరగిద్ద సర్పంచ్ మధుసూదన్, టీడీపీ మండల అధ్యక్షుడు శేరి పెంటారెడ్డి, కార్యదర్శి రాంచంద్రయ్య తదితరులున్నారు.
 
 మిగిలిన పంటల రక్షణకు ఐదు సాంకేతిక బృందాలు
 ఈ ఖరీఫ్‌లో మిగిలిన పంటలను రక్షించుకోవడానికి ఐదు సాంకేతిక బృందాలను (టెక్నికల్ మొబైల్ టీమ్స్) నియమించినట్లు జేడీఏ విజయకుమార్ తెలిపారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి వర్షాలకు తట్టుకొని నిలిచిన పంటల దిగుబడిని పెంచడానికి అవసరమైన సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తారని పేర్కొన్నారు. వీరిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, సీనియర్ వ్యవసాయాధికారులు, ఏడీలు ఉంటారని వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా