ప్రకృతి వ్యవసాయం భేష్‌

8 Oct, 2023 05:12 IST|Sakshi

 ఆఫ్రికా దేశాల బృందం ప్రశంస

యగ్నిశెట్టిపల్లి వద్ద పంటల పరిశీలన

చిలమత్తూరు: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చాలా బాగుందని ఆఫ్రికా దేశాల ప్రతినిధుల బృందం ప్రశంసించింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ పరిధిలోని యగ్నిశెట్టిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బృందం శనివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.విజయకుమార్‌ ఆధ్వర్యంలో సెనగల్, టునీషియా, మడగాస్కర్, జాంబియా, బెనిన్, మలవాయి తదితర ఆఫ్రికా దేశాల నుంచి 27 మంది ప్రతినిధులు యగ్నిశెట్టిపల్లిలోని పంట పొలాలను పరిశీలించారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభిస్తున్న నందీశ్వర, నరసింహప్ప అనే రైతులకు చెందిన వేరుశనగ, నవీన్‌కు చెందిన పత్తి పంటలను పరిశీలించారు. పంటల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ విధానం తదితర వాటిని రైతులు, అధికారులు సమగ్రంగా వివరించారు.

అనంతరం గ్రామంలోని కల్పవల్లి గ్రామ సంఘం, మహేశ్వరి మహిళా సంఘ సభ్యులు ప్రధాన పంటలు ఐదు రకాలు వేయటం, 20 రకాల జీవ వైవిధ్య పంటల సాగు, 5శాతం విత్తనాలు వేసుకోవడం వల్ల వచ్చిన ఫలితాలు, మార్కెటింగ్‌ వంటి వాటిని విదేశీ బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో)కు చెందిన ఆన్నె సోఫియా, సీఐఆర్‌ఏడీకి చెందిన బ్రూనో, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లక్ష్మానాయక్, అధికారులు విజయ్‌కుమార్, బాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు