ఉలికిపడిన రవాణా శాఖ

5 Dec, 2018 06:57 IST|Sakshi
డీటీసీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

ఏఎంవీ ఇల్లు... డీటీసీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

అనుకోని సంఘటనతో కలవరపడిన ఉద్యోగులు

విధులు నిర్వర్తిస్తున్నంతసేపూ ఆందోళనలోనే అధికారులు

కొందరు అధికారులు కార్యాలయానికి డుమ్మా...

విజయనగరం ఫోర్ట్‌: రవాణశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో... ఆయన పనిచేస్తున్న విజయనగరంలోని డీటీసీ(ఉప రవాణా కమిషనర్‌) కార్యాలయంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టడమే దీనికి కారణం. ఏకకాలంలో మంగళవారం ఉదయం నుంచి రెండు చోట్లా సోదాలు చేపట్టడంలో అధికారులతోపాటు, సిబ్బందిలో కలవరం మొదలైంది. విధులు నిర్వర్తిస్తున్నంతసేపూ రవాణా శాఖ అధికారులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కొంతమంది అధికారులు కార్యాలయానికి రాకుండా డుమ్మా కొట్టారు. ఇక్కడ పనిచేసిన అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడంఇదే మొదటిసారి కానప్పటికీ... రెండేళ్ల గ్యాప్‌ తరువాత జరగడమే చర్చకు కారణమైంది.

కానిస్టేబుల్‌ నుంచి ఏఎంవీగా పదోన్నతి
కొత్తపల్లి రవికుమార్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి చేరా రు. విశాఖ పరిధిలోని గాజువాక, మర్రిపాలెం రవాణా శాఖ కార్యాలయాల్లో 20 ఏళ్లపాటు కానిస్టేబుల్‌గా పని చేసి 2014 సెప్టెంబర్‌ నెలలో ఏఎంవీగా పదోన్నతిపై విజయనగరం వచ్చారు. విజయనగరం డీటీసీ కార్యాలయంలో కీలకంగా చక్రం తిప్పుతూ ఆదాయానికి మిం చి ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపైనే మంగళవారం తెల్లవారు జామునుంచి విశాఖలోని కోరమండల్‌ గేటు వద్ద ఉన్న అతని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

చేతివాటం ఎక్కువే
చేతివాటం ప్రదర్శించడంలో రవికుమార్‌ది ఓ ప్రత్యేకతన్న ప్రచారం స్థానికంగా ఉంది. ఈయన డీటీసీ కార్యాలయంలో గాకుండా ఎక్కువగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌(వాహన తనిఖీలు చేసే విభాగం)లోనే పనిచేయడానికి ఇష్టపడేవారని స్థానికంగా తెలుస్తోంది. వాహన తనిఖీలు చేసేటప్పుడు చూసీచూడనట్టు వ్యవహరిస్తే చేతివాటం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందనే భావనతో ఈ విభాగాన్ని ఎంచుకుంటారని చెబుతున్నారు. ఈయనపై వచ్చిన ఈ ఆరోపణలతోనే ఏడాది క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నుంచి తప్పించి డీటీసీ కార్యాలయానికి చేర్చారు. మూడు రోజుల క్రితమే మరలా ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ విభాగం బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

పని విజయనగరం... నివాసం విశాఖలో...
ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ సగం మంది అధికారులు పనిచేసే చోట నివాసం ఉండడం లేదు. అధికశాతం మంది విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాని ఉన్నత అధికారులకు మాత్రం స్థానికంగా నివాసం ఉంటున్నట్టు చూపించడం కోసం ఒక గది అద్దెకు తీసుకుని ఉంచుతున్నారు. అందులో ఈయన కూడా విశాఖనుంచే రాకపోకలు చేస్తున్నారు.

2016లో ఇన్‌చార్జ్‌ ఆర్టీఓ చిన్నోడుపై దాడులు
2016లో డీటీసీ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ ఆర్టీఓగా పనిచేసిన పిల్లి చిన్నోడు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఆయన కూడ విశాఖలోని సీతమ్మధారలో నివాసం ఉండడంతో అక్కడే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన దాదాపు రూ.60 కోట్ల వరకు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు గుర్తించడంతో ఉన్నత అధికారులు అతన్ని సస్పెండ్‌ చేసారు. రెండేళ్ల అనంతరం ఇప్పుడు ఏఎంవీ రవికుమార్‌ను కూడ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై విశాఖలోనే దాడులు నిర్వహించడం గమనార్హం. వీరే గాదు... కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తాల దగ్గర నుంచి ఇన్‌స్పెక్టర్లు, ఉన్నత అధికారుల వరకు ఆదాయానికి మంచి సంపాదిస్తున్నాననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి విశాఖకు బదిలీపై వెళ్లి ఏసీబీకి పట్టుబడ్డ మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్లు(ఎంవీఐ) రమేష్‌. గర్భాల బాలనాయక్‌ కూడా  రూ.కోట్లలోనే సంపాదించినట్టు తేలింది.

ఏసీబీకి దొరుకుతున్నా అవినీతి మామూలే...
రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నా... ఎవరూ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కలేదు. ఇప్పటికీ ఏజెంట్ల ద్వారా వెళితేనే విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో పని జరుగుతుంది, లేదంటే జరగడం లేదనీ పలువురు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అంతా జరుగుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నా... అందులోనూ లొసుగులు చూపించి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు