సెటిల్‌మెంట్‌ వివాదంలో ఏజీపీ నాగరాజు

28 Apr, 2017 01:17 IST|Sakshi

- ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులోనే వాదనలు
- ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: కోర్టుల్లో న్యాయపరిరక్షణ నిమిత్తం నియమితులైన ప్రభుత్వ సహాయ న్యాయవాదులు(ఏజీపీ) సైతం సెటిల్‌మెంట్లు చేస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. కోర్టులో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఏజీపీ ఓ కేసులో పోలీసులతో కలిసి సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో పాలుపంచుకుని, బాధితులను బెదిరించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితులు హైకోర్టులో దాఖలు చేసిన కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజీపీ నాగరాజు పోలీసుల తరఫున వాదనలు వినిపించేందుకు గురువారం కోర్టుకు వచ్చారు. నాగరాజును బాధితులు గుర్తుపట్టి, ఇతనే తమను పోలీసులతో కలిసి బెదిరించినట్లు కోర్టు హాల్‌లోనే న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎవరినీ బెదిరించలేదని ఏజీపీ చెప్పగా, తమ వద్ద ఫొటోలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు నివేదిం చారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా ఎస్పీని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా అగిరిపల్లిలో పోలీస్‌స్టేషన్‌ నిర్మాణం నిమిత్తం సదరు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ డబ్బు వసూలు చేసి, దుర్వినియోగం చేశారని, దీనిపై ఫిర్యాదు చేసినందుకు తమపై తప్పుడు కేసులు బనాయించారని, ఈ కేసులో దర్యా ప్తును సీఐడీ లేదా సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అదే గ్రామానికి చెందిన పాలేటి వీఆర్‌ మహేశ్వరరావు, వేమూరి విల్సన్‌రాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ నెల 22న నాగరాజు అగిరిపల్లికి వచ్చి, ఎస్‌ఐ డబ్బు డిమాండ్‌ చేయలేదని, తాము అతనికి డబ్బు ఇవ్వలేదంటూ కాగితాలపై సంతకాలు పెట్టాలంటూ తమను బెదిరించారని న్యాయమూర్తికి వివరించారు. ఈ కేసులోనే వాదనలు వినిపించేందుకు వచ్చిన నాగరాజును వారు గుర్తు పట్టి, అన్ని విషయాలను కోర్టుకు నివేదించారు.

మరిన్ని వార్తలు