విశాఖపై మమకారం

1 Sep, 2015 23:36 IST|Sakshi
విశాఖపై మమకారం

అభివృద్ధి కోసం తాపత్రయం
ప్రగతికి అర్థం.. వైఎస్ హయాం
సాక్షి, విశాఖపట్నం:
అరకొరగా రేషన్ కార్డులు.. అదృష్టవంతులకే పింఛన్లు..ఏ కొందరికో ఇళ్లు..ఇదంతా 2004కు ముందు దుస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు వంటివి మంజూరయ్యాయి. ఆయన హయాంలో విశాఖపట్నం జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ దుర్మరణం చెంది ఆరేళ్లవుతున్న సందర్భంగా ఆయన హయాంలో విశాఖలో చేపట్టిన వివిధ పనులు, పథకాలపై ఈ కథనం..
 
వైఎస్ తన ఐదేళ్ల పదవీ కాలంలో జలయజ్ఞం పథకం కింద విశాఖ జిల్లాలో భారీ గా నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ రిజర్వాయర్ల ఆధునికీకరణ పనులకు రూ. 42 కోట్లు కేటాయించారు. తాండవ రిజర్వాయర్ ఆధునికీకరణకు రూ. 55 కోట్లు, తాండవ నదిపై మినీ ఆనకట్ట నిర్మాణానికి, రావణాపల్లి ప్రాజెక్టుకు రూ. 18 కోట్లు వెచ్చించారు. ఇలా వివిధ సాగునీటి ప్రాజెక్టులతో వేలాది ఎకరాల కు అదనపు ఆయకట్టు పెంచారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. అంతేకాదు.. జిల్లాలో భారీగా గృహ నిర్మాణం చేపట్టారు. ఐదేళ్లలో మొత్తం 3,20,621 ఇళ్లు నిర్మించారు.

పెద్దసంఖ్యలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత అభయహస్తం తదితర పింఛన్లు ఇచ్చారు. ఇలా మొత్తం 3,20,123 మందికి లబ్ది చేకూర్చారు. ఇందుకోసం ఏడాదికి మొత్తం రూ. 8.24 కోట్లు ఖర్చు చేశారు. ఇక నగరం విషయానికొస్తే.. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద విశాఖకు అధిక నిధులు వచ్చేలా కృషి చేశారు. ఈ పథకంలో విశాఖ నగరానికి రూ.2200 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో విలీన గ్రామాలను కలుపుతూ వేసిన బీఆర్‌టీఎస్ రోడ్లకు రూ.450 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.250 కోట్లు, 15 వేల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లకు రూ.450 కోట్లు విడుదలయ్యాయి.

ఇంకా రూ.23 కోట్లతో ఎండాడ వద్ద మంచినీటి పథకం, విశాఖ నగర దాహార్తిని తీర్చే తాటిపూడి పైప్‌లైన్‌కు రూ.95 కోట్లు ఖర్చు చేశారు. మధురవాడ, రుషికొండ ఐటీ సెజ్‌ల ఏర్పాటుతో విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారు. అలాగే 1130 పడకలు, 21 సూపర్‌స్పెషాలిటీ బ్లాకులతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక విమ్స్ ఆస్పత్రికి రూ. 250 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వరకూ రూ.87 కోట్లు వెచ్చించి విశాఖలోనే తొలి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. విశాఖ విమానాశ్రయం విస్తరణ, ఆధునీకరణకు రూ.100 కోట్లు, విమానాశ్రయం ముంపుబారిన పడకుండా కాలువ నిర్మాణానికి రూ.60 కోట్లు వెచ్చించారు.
 
ప్రస్తుత పరిస్థితి.. : వై.ఎస్. మరణాంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది.  జలయజ్ఞం ప్రాజెక్టులపై క్షక్ష కట్టింది. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం అప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చేసి పక్కన పెట్టేసింది. విమ్స్ ఆస్పత్రి అతీగతీ లేకుండా అక్కరకు రాకుండా నిరుపయోగంగా ఉంది. పైగా 1130 పడకలను 250కి కుదించాలని చూస్తోంది. అర్హులైన లబ్దిదార్లు పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సర్కారు రకరకాల నిబంధనలతో సంక్షేమ పథకాలకు వీరిని దూరం చేస్తోంది. ఈ నేపథ్యంలో నాటి వైఎస్ హాయాంకు, నేటీ చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వర్థంతి సందర్భంగా విశాఖ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు