'నిజాం120 కేజీల బంగారం ఇచ్చారు'

20 Jan, 2014 14:50 IST|Sakshi
'నిజాం120 కేజీల బంగారం ఇచ్చారు'

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై టీడీపీ అనుసరిస్తున్న విధానాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తప్పుబట్టారు. చంద్రబాబు ఇద్దరు కొడుకుల సిద్ధాంతం ఏంటని ఆయన ప్రశ్నించారు. విభజనపై చంద్రబాబు డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు. సమన్యాయం అంటే  ఏమిటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు ఎలాంటి న్యాయం కోరుతున్నారో ఎందుకు వెల్లడించరని ప్రశ్నించారు. విభజనపై మీ విధానం ఏమిటని చంద్రబాబును అడిగితే మీకు ఎంతమంది పిల్లలు అని ఎదురు ప్రశ్న వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చేతులు కలపబోమని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నరేంద్ర మోడీతో ఎందుకు చేతులు కలిపారని నిలదీశారు.

నిజాం పాలనపై అసెంబ్లీలో మంత్రి శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజనకు కారకులైన వారిని వదిలేసి నిజాం నవాబులను నిందించడం తగదన్నారు. రాష్ట్ర విభజనకు నిజాం కారకుడా అని ప్రశ్నించారు. నిజాంలు సమర్థుడైన పాలకులని కితాబిచ్చారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో నిజాం నవాబులు 120 కేజీల బంగారాన్ని భారత సైన్యానికి ఇచ్చారని గుర్తు చేశారు. పాత గాయాలజోలికి పోవద్దని, వాటిని రేపితే అన్ని ప్రాంతాల ప్రజలు గాయపడతారని అక్బరుద్దీన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు