‘మత్తు’ వదిలించొచ్చు

18 Jun, 2019 11:50 IST|Sakshi

మద్యం మహమ్మారి నేడు అనేక కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది.. మద్యానికి బానిసైనవారు తమ శరీరానికి హాని చేసుకోవడమే కాకుండా ఇంట్లోవారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారు.. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువుగా మృతి చెందడం చూస్తున్నాం. వారిలో చాలామంది మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదాలు జరిగి మృతిచెందినట్లుగా తేలడం విస్మయానికి గురిచేస్తోంది. మద్య పానానికి అలవాటుపడిన వారు నలుగురిలో చులకనకు గురవుతారు.. చాలామందికి మద్యం మానాలని ఉన్నా రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రారంభిస్తారు.. అయితే చిత్తశుద్ధి ఉంటే వారిలో ఈ వ్యసనాన్ని తేలిగ్గా పోగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాక్షి, విజయవాడతూర్పు : సరదాగా స్నేహితులతో కలిసి వీకెండ్స్‌లో తాగేవారు కొందరు..కాయకష్టం చేసి, అలసటను మర్చిపోవాలనే ఉద్ధేశంతో తాగేవారు మరికొందరు. మద్యానికి బానిసలై ఉదయం నిద్రలేవగానే మద్యం తాగే వాళ్లు ఇంకొందరు. ఇలా పురుషుల్లో 17 శాతం మంది ఏదొక సమయంలో మద్యం తాగుతూ ఉంటారు. వారిలో సాయంత్రం 6 గంటల తర్వాత తాగేవారు అధికంగా ఉండగా, రాత్రి 9 నుంచి వేకువ జామున 3 గంటల వరకూ మద్యం తాగే వారు అత్యధికంగా ఉన్నట్లు అంచనా. అలాంటి వారి కారణంగానే ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నట్లు మానసిక వైద్యులు చెబుతున్నారు. 

రక్తంలో ఆల్కాహాల్‌ శాతం పెరిగితే...
మద్యం అధికంగా తాగడం వలన రక్తంలో ఆల్కాహాల్‌ శాతం పెరిగి తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. అలెర్ట్‌నెస్‌(అప్రమత్తత) తగ్గడం, సరిగ్గా వినపడక పోవడం, విజన్‌(కంటిచూపు) తగ్గడం, తక్షణమే నిర్ణయం తీసుకునే శక్తి తగ్గడం జరుగుతుంది. ఈ ప్రభావంలో వాహనం నడిపే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులను గుర్తించలేక ప్రమాదాలకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువుగా జరుగుతున్నట్లు అంచనా.  

అనారోగ్య సమస్యలు
అధికంగా మద్యం సేవించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వెంట్రుకల నుంచి కాలిపాదం వరకూ శరీరంలోని ప్రతి అవయవంపై మద్యం ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా లివర్‌ దెబ్బతినడం, కిడ్నీలు పాడవడం, రక్తనాళాలు, గుండెపై ప్రభావం చూపడం, రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పేగు పూత, ప్రాంకియాటైటీస్‌ వంటి సమస్యలు ఆల్కాహాలిస్టుల్లో సర్వసాధారణంగా వస్తుంటాయి. మద్యం సేవించే వారిలో దాంపత్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెపుతున్నారు. 

మాన్పించవచ్చు..
మద్యానికి బాలిసలైన వారిని మాన్పించేందుకు వైద్యం అందుబాటులో ఉంది. రెండు సంవత్సరాల పాటు క్రమం తప్పక మందులు వాడటం ద్వారా మద్యం అలవాటును పూర్తిగా మాన్పించవచ్చునని మానసిక వైద్యులు చెబుతున్నారు. రోజుకు మూడు క్వార్టర్లు కన్నా ఎక్కువ మద్యం తాగే వారికి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది. మద్యం తాగే ప్రతి వంద మందిలో 10 మంది మానేందుకు ప్రయత్నిస్తూ చికిత్సకోసం వస్తున్నట్లు చెబుతున్నారు. అలా వచ్చిన వారిలో 90 శాతం మంది తిరిగి మద్యం తాగడం జరగడం లేదంటున్నారు.  

మరిన్ని వార్తలు