ఎగువ నిండకుంటే.. దిగువ కన్నీరే!

16 May, 2015 03:25 IST|Sakshi
ఎగువ నిండకుంటే.. దిగువ కన్నీరే!

ఎగువన కర్ణాటకలోని రిజర్వాయర్లన్నీ ఖాళీ
అవి నిండితేనే దిగువన జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు నీరు
పరిస్థితిని సమీక్షించిన సమీకృత నీటి ప్రణాళిక, నిర్వహణ  కమిటీ
ఖాళీ రిజర్వాయర్లు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన
తాగునీటి అవసరాలకు 80 టీఎంసీల నిల్వ చేశాకే ఖరీఫ్‌కు నీరు!
ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తప్పని కటకట?

 
హైదరాబాద్: కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి. జలకళను కోల్పోయి నిర్జీవంగా మారడం రాష్ట్రాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి కొరత ఉండటం.. మరోవైపు ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడతాయన్న అంచనాల నేపథ్యంలో రాష్ర్ట వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రాజెక్టులు నిండకుంటే రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఒట్టికుండలుగా మారే ప్రమాదముంది.

అదే జరిగితే వాటి కింద ఆయకట్టుకు సకాలంలో నీరివ్వడం గగనమే. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు అవసరాలపై సమీక్షించిన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సైతం ఖాళీ రిజర్వాయర్లు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది. తాగునీటి అవసరాలను తీర్చేలా కనీసం 80 టీఎంసీల నీరు వచ్చేంత వరకు ఖరీఫ్‌కు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోరాదని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది.

అన్నీ ఖాళీయే..
కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. గోదావరి ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఎక్కడా ఖరీఫ్ సరిగా సాగలేదు. కృష్ణా పరిధిలో నీటి లభ్యత ఉన్నా విద్యుదుత్పత్తికి వినియోగించడంతో నిల్వలు తగ్గాయి. దీంతో మూడు ప్రాజెక్టుల పరిధిలోని మొత్తం నీటి నిల్వ 539.80టీఎంసీలకు గాను 175.25 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది.

గతేడాది ఇదే సమయానికి 204.59 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఈసారి మరో 30టీఎంసీలు తగ్గిపోయింది. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఈ నేపథ్యంలో జూన్‌లో వర్షాలు సకాలంలో కురిసినా.. అక్కడి  ప్రాజెక్టులు నిండి దిగువన మన ప్రాజెక్టులకు నీరు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. వర్షాలు సరిగా కురవకుంటే దిగువన మనకు మిగిలేది కన్నీరే.
 
ఎల్‌నినో ఎఫెక్ట్..
ఇప్పటికే  రిజర్వాయర్లన్నీ ఖాళీకావడానికి తోడు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండే అవకాశముందన్న హెచ్చరికలు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో నీటి పరిస్థితి, ఖరీఫ్ అవసరాలపై సమీక్షించిన రాష్ట్ర స్థాయి సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ సమావేశం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఒక్కో చోట భారీగా వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల అసలే పడవని.. అదే జరిగితే ప్రాజెక్టుల్లో నీరు చేరడం గగనమేనని ఆందోళన వ్యక్తం చేసింది.

దీంతో ఖరీఫ్ ఆయకట్టును ముందస్తుగా నిర్ణయించడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యమిస్తూ.. ఎస్సారెస్పీలో 15 టీఎంసీలు, శ్రీశైలంలో 15, సాగర్‌లో 50టీఎంసీల మేర నీటి లభ్యత వచ్చాకే ఖరీఫ్ ప్రణాళికను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే సాగర్ కింద 6.3లక్షల ఎకరాలు, జూరాల కింద లక్ష, ఎస్సారెస్పీ కింద మరో లక్ష ఎకరాలకు నీటి కటకట తప్పదు.

మరిన్ని వార్తలు