తెలంగాణకు 9, ఏపీకి 16

23 Sep, 2017 01:27 IST|Sakshi

టీఎంసీల శ్రీశైలం లభ్యత నీరు కేటాయిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న నీటిలో 25 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకూ పంచుతూ కృష్ణా బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 9 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 16 టీఎంసీలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే శ్రీశైలం నుంచి సాగర్‌కు రోజుకు ఒక టీఎంసీ చొప్పున 16 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సూచించింది. తెలంగాణకు కేటాయించిన నీటిలో హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు చెరో 2 టీఎంసీల చొప్పున 4 టీఎంసీలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి కింది తాగునీటి అవసరాలకు మరో 5 టీఎంసీలు వాడుకోవాలని పేర్కొంది. ఏపీకి కేటాయించిన నీటిలో సాగర్‌ కుడి కాల్వకు 6 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు అవసరాలకు 5 టీఎంసీలు, హంద్రీ–నీవా కింది అవసరాలకు మరో 5 టీఎంసీలు వాడుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఏపీ ఇప్పటికే హంద్రీ–నీవా కింద 1.08 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు కింద 1.5 టీఎంసీలు వాడుకున్నందున ప్రస్తుత కేటాయింపుల్లో వాటిని లెక్కించాలని సూచించింది. అలాగే కల్వకుర్తి కింద తెలంగాణ సైతం ఇప్పటికే 1.65 టీఎంసీలు వాడినందున రాష్ట్రానికీ ఇదే సూత్రం వర్తిస్తుందని బోర్డు తెలిపింది.

జూన్‌ వరకు నీటి కేటాయింపులపై మళ్లీ చర్చిద్దాం...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీతోపాటు ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు, సాగర్‌ సీఈ సునీల్, అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్‌ ఇంజనీర్‌లు హాజరయ్యారు. తమ తాగునీటి అవసరాలకు 16 టీఎంసీలు అవసరమని ఏపీ తెలపగా... నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల తాగునీటి అవసరాలకు 40 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. ఇందుకు ఏపీ అభ్యంతరం తెలిపింది. తాము కేవలం ఒక నెల అవసరాలనే ఇండెంట్‌గా సమర్పించామని, ఏడాదికి అవసరమయ్యే నీటిపై మరోమారు బోర్డు సమావే శంలో చర్చించి నిర్ణయిద్దామని సూచించింది. దీనిపై బోర్డు సానుకూలంగా స్పందించ డంతో అక్టోబర్‌ 15 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి వచ్చే జూన్‌ వరకు అవసరమయ్యే నీటి కేటాయింపులపై చర్చించాలని ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది.

ప్రాజెక్టుల నియంత్రణపై మాకు అధికారాల్లేవు: సమీర్‌ చటర్జీ
ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి తమకు అధికారాలేవీ లేవని, అందుకే తమ ఆదేశాలను ధిక్కరించి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నా ఏమీ చేయలేక పోతున్నామని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీ పేర్కొన్నారు. బోర్డు భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము కేవలం ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే వినతులు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేస్తున్నాం. వాటిని ఇరు రాష్ట్రాలు సరైన రీతిలో అమలు పరచకుంటే మేమేం చేయలేం. తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం. మా చేతులు కట్టేసి, అధికారాలివ్వకుండా ఇరు రాష్ట్రాలను నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు’’అని అన్నారు.

మరిన్ని వార్తలు