‘నిమ్మగడ్డ రమేష్ ఒక్కరే ఆ స్థానానికి పనికొస్తారా?’

11 Apr, 2020 18:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా నియమితులైన జస్టిస్‌ కనగరాజ్‌ సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేశారని, న్యాయకోవిదుడు ఎస్‌ఈసీ స్థానంలో ఉంటే చట్టాలను పటిష్టంగా అమలు చేయగలరని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. వ్యవస్థను బలోపేతం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయంపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్‌ కనగరాజ్‌ గతంలో మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేశారని అంబటి తెలిపారు. 9 ఏళ్లు జడ్జిగా జస్టిస్‌ కనగరాజ్‌ కీలక తీర్పులు ఇచ్చారు. ఆయన ఇచ్చిన తీర్పులను ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా అనుసరించాయన్నారు. సామాన్య దళిత కుటుంబం నుంచి హైకోర్టు జడ్జిగా ఎదిగిన వ్యక్తి జస్టిస్‌ కనగరాజ్ అని కొనియాడారు. దళితుడు, న్యాయకోవిదుడు ఎస్‌ఈసీ స్థానానికి పనికిరారా? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ ఒక్కరే ఆ స్థానానికి పనికొస్తారా? అని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు.(ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌)


నిమ్మగడ్డ రమేష్‌కి జడ్జిగా వ్యవహరించే అర్హత లేదు. అందుకు ఆయన కేంద్రానికి రాసిన లేఖే నిదర్శనం. జడ్జి స్థానంలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారు? 2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు? వ్యవస్థలపై చంద్రబాబుకు గౌరవం లేదు. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. కరోనా నియంత్రణకు సీఎం జగన్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కరోనాను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఐదు ఏళ్ళు ఉండేలా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎన్నికల కమిషనర్‌గా ఉండేలా చట్టం ఉండేది. ఐఏఎస్‌లు రాజకీయ నాయకుల దగ్గర పని చేసి ఉంటారు కాబట్టి నిష్పక్షపాతంగా పని చేయలేరు. రిటైర్డ్ ఐఏఎస్ కంటే రిటైర్డ్ జడ్డి అయితే బాగుంటుందనే అభిప్రాయంతో సంస్కరణలు చేశారు. గతంలో ఐదేళ్లు ఉండే పదవి కాలాన్ని మూడేళ్లు ఉండేలా చట్టం తెచ్చారు. కొత్తగా తెచ్చిన చట్టంతో నిమ్మగడ్డ రమేష్ పదవి కాలం ముగిసింది. తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనకరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం నియమించింది.

దళితులను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే టెర్రిస్టు రాజ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేస్తున్నారు. రిఫరీగా ఉండాల్సిన నిమ్మగడ్డ రమేష్ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అంటూ లేఖలు రాస్తారా? కరోనా మీద దృష్టి పెడుతూనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. బీజేపీకి పట్టిన పచ్చ చీడ కన్నా లక్ష్మీనారాయణ. సీఎం వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత కన్నాకు లేదు. కన్నా గత చరిత్ర మర్చిపోకుడదు. సీపీఐని చంద్రబాబు జేబు సంస్థగా రామకృష్ణ చేశారు అని అంబటి రాంబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు