అరబ్‌ దేశాలకు ‘అనంత’ అరటి

29 Jan, 2020 05:23 IST|Sakshi

తొలిసారి జిల్లా నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి

‘హ్యాపీ బనానా’ బ్రాండ్‌ పేరిట 890 మెట్రిక్‌ టన్నులతో ప్యాకింగ్‌ రెడీ

ఈనెల 30న తాడిపత్రి నుంచి ప్రత్యేక రైలు వ్యాగన్‌ ఏర్పాటు

మంత్రి కన్నబాబు.. అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కమిషనర్ల రాక

అనంతపురం అగ్రికల్చర్‌: కరువుసీమ అనంతపురం జిల్లాలో పండిన నాణ్యమైన అరటి పంట తొలిసారిగా గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి కాబోతోంది. ఇందుకు ఈనెల 30న ముహూర్తం ఖరారైంది. ఉద్యాన శాఖ, గుజరాత్‌కు చెందిన దేశాయ్‌ కంపెనీ అవసరమైన ఏర్పాట్లుచేశాయి. జిల్లాలోని తాడిపత్రి నుంచి ఈ ఎగుమతిని ప్రారంభించడానికి 43 బోగీలు కలిగిన ప్రత్యేక రైలు వ్యాగన్‌ను ఏర్పాటుచేస్తున్నారు. తొలివిడతగా 890 మెట్రిక్‌ టన్నుల అరటిని నిబంధనల మేరకు ప్యాకింగ్‌ చేసి కంటైనర్లలో సిద్ధంగా ఉంచారు. ‘హ్యాపీ బనానా’ పేరుతో ఇక్కడి అరటి సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, దుబాయ్‌ ప్రాంతాలకు వెళ్లనుంది.

అరటి హబ్‌గా ‘అనంత’
ఇప్పటివరకు వివిధ కంపెనీలు ఇక్కడ అరటిని కొనుగోలు చేసి తర్వాత ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసినట్లు చెబుతున్నా.. తొలిసారిగా అరబ్‌ దేశాలకు నేరుగా ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరటి సాగుకు ప్రసిద్ధి చెందిన ‘అనంత’.. మున్ముందు అరటి హబ్‌గా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30–35 మండలాల్లో అరటి తోటల సాగవుతున్నా.. ఇందులో 70–80 శాతం సాగు విస్తీర్ణం పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, నార్పల, తాడిమర్రి, బత్తలపల్లి, ఆత్మకూరు మండలాల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా 16,402 హెక్టార్లలో అరటి సాగవుతుండగా.. 11.65 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర పంట రావచ్చని అంచనా. అలాగే.. ఇక్కడి నేలలు, నీరు, వాతావరణం కారణంగా నాణ్యమైన అరటి వస్తుందని చెబుతున్నారు. అందువల్లే ఈ ప్రాంత అరటికి బెంగళూరు, చెన్నై, కోల్‌కత లాంటి దేశీయ మార్కెట్లతో పాటు యూరప్, మధ్య ఆసియా దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

100 % టిష్యూ కల్చర్‌
రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో గ్రానైన్‌ (జీ–9) అనే అరటి రకం 100 శాతం టిష్యూ కల్చర్‌ పద్ధతిలో సాగుచేస్తున్నారు. అలాగే, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 100 శాతం డ్రిప్‌ పద్ధతి, 100 శాతం ఫర్టిగేషన్‌ పద్ధతి (నేరుగా ఎరువులు అందించే విధానం) అవలంబిస్తున్నారు. ఎకరాకు మొదటి పంటకు రూ.70 నుంచి రూ.80 వేలు ఖర్చుచేస్తున్నారు. రెండో పంటకు రూ.40 నుంచి రూ.50 వేలు, మూడో పంటకు అంతే పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. రెండున్నర సంవత్సరాల్లో మూడు పంటలు తీస్తారు. అలాగే, ఎకరాకు 25–30 టన్నుల వరకు అరటిని పండిస్తున్నారు. దేశంలోనే అత్యధిక ఉత్పాదక శక్తిలో ‘అనంత’ రెండో స్థానంలో ఉంది. కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టన్ను అరటికి రూ.8 వేల కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై అరటి రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతున్న అరటి ప్రస్తుతం టన్ను రూ.12,500 ధర పలుకుతోంది.

‘అనంత’కు గర్వకారణం 
తొలిసారిగా జిల్లా నుంచి ఈనెల 30న నేరుగా అరబ్‌ దేశాలకు 890 మెట్రిక్‌ టన్నులు అరటిని ఎగుమతి చేస్తుండటం ‘అనంత’కు గర్వకారణం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, దేశాయ్‌ కంపెనీ సహకారంతో ప్రత్యేక రైలు వ్యాగన్‌ను ఏర్పాటుచేశాం. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానశాఖ కమిషనర్లు ఇక్కడకు విచ్చేస్తున్నారు. ఉద్యాన శాఖ ఏడీలు, ఏపీడీలు, హెచ్‌వోలు దీనిపై అవసరమైన ఏర్పాట్లుచేశారు. 

మరిన్ని వార్తలు