బోర్డు మారింది.. ప్రస్థానం ముగిసింది 

2 Apr, 2020 09:18 IST|Sakshi
బందరులోని ఆంధ్రాబ్యాంక్‌ వ్యవస్థాపక బ్రాంచ్‌ కార్యాలయం నేమ్‌ బోర్డుపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన బ్యానర్‌   

 కనుమరుగైన ఆంధ్రాబ్యాంకు  

యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో విలీనం  

సాక్షి, మచిలీపట్నం: ఆంధ్రాబ్యాంక్‌ ప్రస్థానం ముగిసింది. యూనియన్‌ బ్యాంక్‌లో విలీనమైపోయింది. తొంబై ఏడేళ్ల చరిత్ర ఇక చరిత్రపుటల్లో కలిసిపోయింది. జిల్లా కేంద్రమైన బందరులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923వ సంవత్సరం నవంబర్‌ 28న స్థాపించిన ఆంధ్రాబ్యాంకు 1980లో తీసుకొచ్చిన బ్యాంకుల జాతీయకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది.

హైదరాబాద్‌ కేంద్రంగా దినదిన ప్రవర్థమానమై 2,885 శాఖలు, 3798 ఏటీఎంలు, 20,346 మంది సిబ్బందితో విస్తరించిన ఈ బ్యాంక్‌ రూ.3,98,511 కోట్ల వ్యాపారంతో రూ.1,80,258 కోట్ల రుణాలు, రూ.2,16,721 కోట్ల డిపాజిట్లతో దేశంలోనే అగ్రశ్రేణి బ్యాంకుల సరసన నిలిచింది. అంతటి చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంకును  యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లో విలీనం చేయాలని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తినా, రాష్ట్ర స్థాయిలో వివిధ రూపాల్లో ఉద్యమాలు సాగినా ఫలితం లేకుండాపోయింది.

ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల విలీనం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆరుబ్యాంకులు విలీనం కాగా, జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య పుట్టిన బందరులో పురుడుపోసుకున్న ఆంధ్రాబ్యాంక్‌ కనుమరుగైంది. బందరులోని వ్యవస్థాపక బ్రాంచ్‌లో బుధవారం ఆంధ్రాబ్యాంక్‌ స్థానంలో యూనియన్‌ బ్యాంక్‌ పేరిట సైన్‌బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా తయారు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆంధ్రాబ్యాంక్‌ నేమ్‌ బోర్డు వద్ద యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంటూ బ్యానర్‌ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు