మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి

17 Jun, 2020 20:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాసన మండలిలో తెలుగుదేశం సభ్యులు బుధవారం గందరగోళం సృష్టించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులపై దాడికి తెగబడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై చేయి చేసుకుని అమర్యాదగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో టీడీపీ నేతలు హడావుడి చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ నిబంధనలకు విరుద్ధంగా మండలిలో సభ్యుల ఫొటోలు తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. (చదవండి : ‘పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు’)

ఈ క్రమంలో లోకేష్‌ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్మన్‌‌.. ఫొటోలు తీయొద్దని ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మంత్రులు.. లోకేష్‌ తీరు సరికాదంటూ మండిపడ్డారు. ఇంతలో మంత్రుల దగ్గరికి చేరుకున్న టీడీపీ సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడికి తెగబడ్డారు. మంతెన సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని కాళ్లతో తన్ని, చేయి చేసుకుని ఆయనను అవమానించారు. ఇదిలా ఉండగా.. కీలక బి​ల్లులు ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. 

మరిన్ని వార్తలు