సెల్ టవర్ నిర్మాణంపై ఆందోళన

18 Apr, 2015 04:54 IST|Sakshi

-లాఠీచార్జి, అరెస్టులకు దారితీసిన వైనం
-స్తంభించిన ట్రాఫిక్

కాకినాడ రూరల్ :సెల్ టవర్ నిర్మాణంపై గత రెండు నెలలుగా జరుగుతున్న పోరాటం శుక్రవారం తీవ్ర రూపం దాల్చింది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జి, పలువురు అరెస్టులు, రాస్తారోకోలకు దారితీశాయి. ఒకానొక దశలో ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరగ్గా, కొందరు గాయాలు పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

ఇంద్రపాలెం పంచాయతీ పరిధిలోని టేకుమూడి అప్పారావుకు చెందిన స్థలంలో 4జీ సేవలకు అనుకూలంగా సెల్‌టవర్ నిర్మాణం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రైవేటు కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొంది, స్థల యజమాని నుంచి లీజుకు స్థలాన్ని తీసుకుంది. ఈ ప్రాంతంలో సెల్‌టవర్ నిర్మాణం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోయే ప్రమాదం ఉందని, సెల్ టవర్ నిర్మాణం చేయడానికి వీలులేదంటూ కలెక్టర్‌కు, పోలీసులకు, ప్రజావాణిల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన వ్యక్తం చేస్తూ అర్జీలు కూడా అందజేశారు.

పలుమార్లు టవర్ నిర్మాణం చేసే సమయంలో ప్రజలు అడ్డుకోవడంతో నిర్మాణాలను ఆపేశారు. తదుపరి శుక్రవారం మళ్లీ పోలీసుల సాయంతో సెల్ టవర్ నిర్మాణం చేస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో మరోవైపు ప్రజలు నిర్మాణపు పనులను అడ్డుకోవడంతో పోలీసులు సమనయం కోల్పోయి లాఠీఛార్జీకి దిగారు. ఒకానొక దశలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయపడ్డారు.

మొదటి నుంచి ఈ టవర్ నిర్మాణపు పనులు అడ్డుకోవడంలో ప్రజల తరుపున పోరాటంలో కీలకపాత్ర వహిస్తున్న సీపీఎం నాయకులు, ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు, టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండా వినాయక్‌లతో ప్రజల తరఫున మాట్లాడానికి వచ్చి టవర్ నిర్మాణం ఆపాలంటూ అధికారులతో చర్చలు జరుపుతున్నా, పోలీసులు వీరి మాటలను లెక్కచేయకుండా లాఠీఛార్జి చేశారు. సీపీఎం నాయకుడు వీరబాబుతో పాటు 100 మంది మహిళలను అరెస్టు చేసి ఇంద్రపాలెం పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు.

ఈ స్టేషన్‌కు అధికసంఖ్యలో ప్రజలు వస్తారని భావించిన పోలీసులు వీరబాబును, మరో ఐదుగురు మహిళలను తిమ్మాపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో రెచ్చిపోయిన ప్రజలు వందలాదిగా తరలివచ్చి కాకినాడ-సామర్లకోట రోడ్డుపై బైఠాయించి సుమారు నాలుగు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ప్రజల ఆందోళన నేపథ్యంలో స్థల యజమాని తమ స్థలంలో నిర్మిస్తున్న 4 జి సెల్ నిర్మాణం చేయవద్దని, తాను ఇచ్చిన అగ్రిమెంట్‌ను రద్దు చేసుకుంటానని స్వయంగా జిల్లా అధికారులకు మండల అధికారులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చినా పట్టించుకోవడంలేదని ఆందోళనకారులు వివరిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణపు పనులు ఆపి, అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. అధికారులు, పోలీసులు టవర్ నిర్మాణపు పనులు చేయమని స్పష్టమైన హామీని ఇస్తేనే స్టేషన్ నుంచి వెళ్ధానని, లేనిపక్షంలో స్టేషన్‌లోనే ఆందోళనకు దిగుతానంటూ వీరబాబు భీష్మించుకుని స్టేషన్ నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరించారు. నాలుగు గంటలకు పైగా రాస్తారోకో చేయడంతో సుమారు 13 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు