ఇక నుంచి ఎవరి బిల్లులు వారివే

2 Aug, 2014 02:13 IST|Sakshi

ఉభయ ప్రభుత్వాల నిర్ణయం కొన్ని శాఖల్లో ఇంకా రగులుతున్న బిల్లుల చిచ్చు
 
హైదరాబాద్: అపాయింటెడ్ డేకు ముందు సచివాలయంలో మే నెలలో వినియోగించిన విద్యుత్తు బిల్లులను నిష్పత్తి ప్రకారం చెల్లించేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అపెక్స్ కో-ఆర్డినేషన్ కమిటీ సూచనలతో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు జనాభా నిష్పత్తి ప్రకారం చెల్లించేందుకు అంగీకరించారు. మే నెలలో వినియోగించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ 58.32, తెలంగాణ ప్రభుత్వం 41.68 నిష్పత్తి ప్రకారం పంచుకున్నాయి. సచివాలయంలోని తెలంగాణా ప్రభుత్వానికి ఎ,బి, సి,డి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జే, కే, ఎల్, హెచ్ (సౌత్), హెచ్(నార్త్) బ్లాకులు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సచివాలయం మొత్తం ఐదు సర్వీసు నెంబర్లతో కనెక్షన్లు ఉండటంతో మంచినీటి, విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై వివాదాలు చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో అపాయింటెడ్ డేకు ముందు మే నెలలో విద్యుత్తు బిల్లు వాడకంపై నిష్పత్తి ప్రకారం చెల్లిద్దామనే ఒప్పందానికి ఇరు ప్రాంతాల అధికారులు వచ్చారు. ఐదు కనెక్షన్లకు గాను మే నెల విద్యుత్తు బిల్లు రూ.56,94,680 కాగా, ఆలస్య చెల్లింపు ఛార్జీలు రూ.1,06,351 మొత్తం కలిపి రూ.58,01,031 చెల్లించాలని సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) పేర్కొంది. అయితే ఇకనుంచి ఎవరి బిల్లు వారే చెల్లించేలా సీపీడీసీఎల్ వేర్వేరు విద్యుత్తు మీటర్లు బిగించాలని సాధారణ పరిపాలన విభాగం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఈ వోను కోరింది. జీఏడీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ శుక్రవారం జీవో జారీ చేశారు.

అబ్కారీ భవన్‌కు కరెంట్ కట్:ఆంధ్ర, తెలంగాణ ఎక్సైజ్ శాఖలో విద్యుత్తు బిల్లుల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మీరు చెల్లించాలంటే, మీరు చెల్లించాలని ఎవరికి వారే మిన్నకుండిపోయారు. అబ్కారీ భవన్‌కు రూ.8 కోట్ల విద్యుత్తు బకాయిలు పేరుకుపోయాయి.
 

 

మరిన్ని వార్తలు