ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌ 

12 Dec, 2019 22:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి జె. కృష్ణకిశోర్‌తోపాటు పే అండ్‌ అకౌంట్స్‌ విభాగానికి చెందిన అకౌంట్స్‌ అధికారి శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ప్రజాధనం దుర్వినియోగంలో వీరిద్దరి పాత్ర ఉందని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు  సమర్పించింది. పరిశీలించిన ప్రభుత్వం.. వీరిద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంది. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనావళి ప్రకారమే కృష్ణకిశోర్‌ను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొంది. క్రమశిక్షణ ప్రక్రియ ముగిసే వరకూ ఆయన సస్పెన్షన్‌ కొనసాగుతుందని.. శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. వీరిద్దరి మీద నమోదైన అభియోగాలపై తక్షణమే కేసు నమోదు చేసి ఆరు నెలల్లోగా దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (ఏసీబీ)ను, నేర పరిశోధన సంస్థ (సీఐడీ)ని ప్రభుత్వం ఆదేశించింది. కేసు దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రభుత్వ అనుమతిలేనిదే వారివురూ అమరావతిని వీడరాదని తెలిపింది.    

మరిన్ని వార్తలు