విశాఖ ఘటన: హెల్ప్‌లైన్‌ నెంబర్లు ప్రారంభించిన ప్రభుత్వం

7 May, 2020 17:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. ఘటనపై ఎలాంటి సమాచారం కోసమైనా డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌ ప్రసాదరావును సంప్రదించాలని తెలిపారు.

ఇందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు 7997952301... 8919239341 అందించారు. అలాగే మరో అధికారి ఆర్‌ బ్రహ్మ అందుబాటులో ఉన్నారని (9701197069) ఆయన్ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తరలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు భయపడవద్దని, అధికారులకు సహాకరించాలని మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటపురంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో  ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకజీ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. దాదాపు 200 వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సంభవించడంతో ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.  పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఖాళీ చేశారు. అయితే గ్యాస్‌ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. (గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌)

విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ కెమ్ స్పందన

మరిన్ని వార్తలు