ప్రతి ఇంటికీ శుద్ధజలం

5 Oct, 2019 10:58 IST|Sakshi
తోటపల్లి జలాశయం

సాక్షి, విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించాలన్న సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న సాగునీటి రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని ప్రజలందరికీ సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. మరోవైపు జిల్లాలో వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతోంది. ఒక్క నాగావళి నది ద్వారా 16టీఎంసీల నీరు ఏటా ప్రవహిస్తుండగా అందులో 4టీఎంసీలు కూడా వినియోగించుకోలేకపోతున్నాం. చంపావతి, వేగావతి, గోస్తనీ... ఇలా ఏ నది చూసినా ఇలానే ఉంది. ఆ నదుల నీటిని వినియోగించుకునేందుకు వాటిపై జలాశయాలు ఉన్నా నీరంతా నిల్వ చేయకపోవడంతో కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఒక శాశ్వత ప్రాజెక్టు రూపకల్పన చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా శుద్ధి చేసిన నీరు మాత్రమే సరఫరా చేసేలా కసరత్తు చేయాలని సూచించింది. 

ప్రాజెక్టులున్నా... తాగునీటికి కటకటే..
ఇప్పటివరకు ప్రజలకు బోర్ల ద్వారానే తాగునీరు అందుతోంది. రక్షిత మంచినీటి పథకాలు కొన్ని చోట్ల, పైపులైన్ల ద్వారా మరికొన్ని చోట్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కుళాయి కనెక్షన్ల ద్వారా నేరుగా ఇంటికే కొన్ని గ్రామాలు, పట్టణాల్లో నీటిసరఫరా జరుగుతుండగా కొన్నిచోట్ల మాత్రం పథకాల నుంచే జనం తెచ్చుకుంటున్నారు. బోర్లు పాడైనా, భూగర్భజలాలు ఇంకినా తాగునీటి సరఫరా అందడం కష్టంగా మారింది. వాస్తవానికి జిల్లాలో జలాశయాలున్నా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే పథకాలు జిల్లాలో లేవు. తోటపల్లి నుంచి పార్వతీపురానికి, తారకరామతీర్థసాగర్‌ నుంచి విజయనగరానికి నీరందించే ప్రతిపాదనలు ఉన్నా అమలు కాలేదు. తాటిపూడి నీరు విశాఖ వాసుల గొంతు తడుపుతున్నా జిల్లాకు ఉపయోగపడటం లేదు.

శుద్ధ జలం కోసం రూ.2600కోట్లుతో డీపీఆర్‌జిల్లాలో ప్రాజెక్టుల నుంచే తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల నుంచి గ్రావిటీ ద్వారానే నేరుగా నీరు పట్టణాలు, గ్రామాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలకు అందించడం, పైపులైన్ల ద్వారా సరఫరా తెచ్చి ఇంటింటికి కుళాయి ద్వారా అందించడం లక్ష్యంగా ప్రాజెక్టు రూపొందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ విధంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పీడబ్ల్యూ స్కీంలు, సీడబ్ల్యూ స్కీంలు, కేంద్ర ప్రభుత్వం సుజల పథకం, ఇతర తాగునీటి వనరులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కొత్తగా చేపట్టాల్సిన పనుల కోసం డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను జిల్లా అధికారులు తయారు చేశారు. ఇందుకు మొత్తం రూ.2600కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ రిపోర్టుపై రెండురోజుల క్రితం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించారు. ఆయన సూచన మేరకు చిన్నచిన్న మార్పులు చేసి రిపోర్టును ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నారు. 

సంక్షేమం ఒక వైపు... సమగ్రాభివృద్ధి మరోవైపు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో చేపడుతున్న కార్యక్రమాలు. ఒకవైపు వివిధ వర్గాల అభ్యున్నతికి పలు పథకాలను రూపొందించి అమలు చేస్తుండగా... ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటికీ శుద్ధ జలం అందించాలన్న లక్ష్యంతో ఓ బృహత్తర పథకానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం జిల్లాలోని నదీజలాలను సద్వినియోగించుకునేలా డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు రూపొందించారు.

రిపోర్టు పంపిస్తున్నాం
ప్రాజెక్టుల నుంచి శుద్ధ జలం ప్రాజెక్టుపై నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనల మేరకు కొంచెం మార్పులు చేసి శుక్రవారం పంపించాం. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నిధులు మంజూరైతే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తాం. 2021 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్‌ సూచన మేరకు సకాలంలో పక్రియ పూర్తి చేశాం.
– రవికుమార్, ఇన్‌ఛార్జి ఎస్‌ఈ, విజయనగరం

డీపీఆర్‌ ప్రకారం ప్రతిపాదనలు ఇలా...
⇔ తోటపల్లి నుంచి కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలు, పార్వతీపురంలో మూడు, సాలూరులో 1, గజపతినగరంలో 2, విజయనగరంలో 1, నెల్లిమర్లలో 4, బొబ్బిలిలో 3మండలాలు(మొత్తం 19 మండలాలు), అన్ని పురపాలక సంఘాలకు.
⇔ శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని నాగావళి నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు.
⇔ మడ్డువలస నుంచి బలిజిపేట, తెర్లాం
⇔ పెద్దగెడ్డ నుంచి పాచిపెంట
⇔ వెంగళరాయసాగర్‌ నుంచి: సాలూరు రూరల్‌
⇔ తాటిపూడి నుంచి ఎస్‌.కోట నియోజకవర్గంలో ఐదు మండలాలు, గజపతినగరం నియోజకవర్గంలో గంట్యాడ, బొండపల్లి మండలాలకు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా