రహదారులు రయ్‌.. రయ్‌..

17 Jun, 2020 04:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్లు, రవాణా అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దమొత్తంలో  కేటాయింపులు చేసింది. ఆర్‌అండ్‌బీ, రవాణా రంగాలకు రూ. 6,588.58 కోట్లు కేటాయించింది. పర్యావరణ అనుకూల విధానంలో వంతెనలు, రోడ్డు నిర్మాణాలు చేపట్టనున్నారు. రహదారి భద్రతకు నిధులు కేటాయింపు ద్వారా 15 శాతం ప్రమాదాలు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గత బడ్జెట్‌ (2019–20)లో రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ. 6,202.98 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో 6.22 శాతం అధికంగా నిధులిచ్చారు. కాగా, టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ (2018–19)లో ఈ రంగానికి  రూ. 4,703.45 కోట్లు కేటాయించినా.. రూ. 2,599.81 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులతో పాటు నాబార్డు, ఇతర సంస్థల నుంచి నిధులు సమకూర్చుకుంటోందని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 256 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి, మూడు వంతెనల నిర్మాణం, సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ కింద 505 కి.మీ. రహదారుల్ని అభివృద్ధి చేశామని చెప్పారు. వీటితో పాటు ఈఏడాది బడ్జెట్‌ నిధులతో మరో 700 కి.మీ. రహదారుల్ని అభివృద్ధి పరచడానికి ప్రతిపాదించారు.  

► న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సాయంతో 70:30 నిష్పత్తిలో ఖర్చులు భరించే పద్ధతిలో ప్రభుత్వం 2 ప్రాజెక్టులు ప్రారంభించింది.  
► ఆ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ రోడ్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీకనస్ట్రక్షన్‌ ప్రాజెక్టు రాష్ట్ర రహదారులు, వంతెనల అభివృద్ధిపై దృష్టిపెడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మండల కనెక్టివిటీ అండ్‌ రూరల్‌ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు జిల్లా, మండల, కేంద్ర కార్యాలయాల మధ్య రెండు వరుసల రోడ్డు వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందుకు రోజుకు 2 వేల ప్యాసింజర్‌ కార్‌ యూనిట్ల కంటే ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న రోడ్లను ఎంపిక చేస్తారు. ఈ 2ప్రాజెక్టుల ద్వారా 3,104 కి.మీ. పొడవైన రోడ్లు, 479 వంతెనలు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 
► ఈ ఆర్థిక సంవత్సరంలో 325 కి.మీ. రాష్ట్ర రహదారుల మరమ్మతులు, నిర్వహణ చేపడతారు. 1,900 కి.మీ. వరకు మేజర్‌ జిల్లా రహదారుల మరమ్మతులు, గుంతల్లేని రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.   
► విశాఖపట్నం మెట్రో పాలిటన్‌ ప్రాంతంలో రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు 140.11 కి.మీ. మేర మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టంను అభివృద్ధి చేయడం ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి అనకాపల్లి వరకు రోడ్డు అభివృద్ధి చెందుతుంది.  
► 140.11 కి.మీ. మేర ఏర్పాటు కానున్న ఈ రోడ్డులో 79.91 కి.మీ. మేర కారిడార్లు లైట్‌ మెట్రో రైల్‌ అభివృద్ధి, 60.20 కి.మీ. మేర కారిడార్లు కాటినరీ ఫ్రీ మోడరన్‌ ట్రామ్‌/లైట్‌ మెట్రో సిస్టం కోసం వినియోగించనున్నారు. 
► కాస్ట్‌ షేరింగ్‌లో 50 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏపీలో 175 కి.మీ. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 150 కోట్లు, రైల్వే సేఫ్టీ వర్కుల కింద రూ. 50 కోట్లు కేటాయించారు.  
► విద్యార్థులకు, ఇతరులకు అర్హత ప్రకారం 28.32 లక్షల రాయితీ బస్‌ పాస్‌లు ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం రూ. 3,059 కోట్లు కేటాయించారు.  
► ‘వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం’ కింద ఆర్థిక సాయం అందించడానికి బడ్జెట్‌లో రూ. 275.52 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు