బ్రాహ్మణ విద్యార్థులకు వరం..'భారతి విద్యా పథకం'

29 Aug, 2019 12:25 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బ్రాహ్మణ విద్యార్థులు (ఫైల్‌)

1వ తరగతి నుంచి పీజీ వరకు నగదు ప్రోత్సాహకం

15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సాక్షి, తాడేపల్లి:  పేద బ్రాహ్మణ విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ (ఏబీసీ) లిమిటెడ్‌ ఆధ్వర్యంలో భారతి విద్యా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన విద్యార్థులు 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువు కొనసాగించేందుకు ఈ పథకం ద్వారా ఏటా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. 2019–20 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  

అర్హతలు వీరే.. 
విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారై ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తూ ఉండాలి. విద్యార్థి పేరు తప్పనిసరిగా ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. తల్లి, తండ్రి, సంరక్షకుడి వార్షిక ఆదాయం రూ.30 లక్షలకు మించకూడదు. దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యా సంస్థల్లో మాత్రమే చదువుతూ ఉండాలి. 2019–20 విద్యా సంవత్సరంలో పాఠశాల, కళాశాల, ఇన్‌స్టిట్యూట్, విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌ కోర్సు చదువుతూ ఉండాలి. ఆయా కోర్సుల్లో ముందు సంవత్సరంలోని సబ్జెక్టులు అన్నీ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఈ విధంగా ఎటువంటి ఆర్థిక లబ్ధి  పొంది ఉండకూడదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్‌ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులే.

నగదు ప్రోత్సాహకాలు 
1 నుంచి 5వ తరగతి వరకు ఇచ్చే ప్రోత్సాహకం మొత్తం రూ.5 వేలు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.7 వేలు, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డీఎడ్, డీఫార్మసీ తదితర కోర్సులకు రూ.10 వేలు, డిగ్రీ కోర్సులకు రూ.15 వేలు, వృత్తి విద్యా కోర్సులకు రూ.20 వేలు, పీజీ కోర్సులకు రూ.10 వేలు ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థులకు పొదుపు ఖాతాలో జమ చేస్తారు.

దరఖాస్తు చేయడం ఇలా..
అర్హులైన విద్యార్థులు వారి దరఖాస్తులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆంధ్రాబ్రాహ్మిణ్‌.ఏపీ.జీఓవీ.ఐఎన్‌ అనే వెబ్‌సైట్‌లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు 15 ఆగస్టు 2019 నుంచి 30 సెప్టెంబర్‌ 2019 వరకు, ఇతర కోర్సులు చదివే విద్యార్థులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు