సమస్య గులాబీ రంగు పురుగువల్లే!

18 Nov, 2023 01:58 IST|Sakshi
క్షేత్రస్థాయిలో పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

గుంటూరు రూరల్‌: దేశంలో పత్తి పండించే అన్ని రాష్ట్రాల్లో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు తీవ్ర సమస్యగా మారిందనీ, రైతులందరూ సమిష్టిగా ఈ పురుగును నియంత్రించాలని కేంద్ర పత్తి పరిశోధన స్థానం డైరెక్టర్‌ డాక్టర్‌ వై.జి.ప్రసాద్‌ సూచించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 సంవత్సరాల సంబరాల్లో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోథఽన స్థానం లాంఫాం పత్తి విభాగం శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయి పరిశోధన దినోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం నిడుముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర పత్తి పరిశోధన ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రాంతంలోని రైతులందరూ పత్తి పంటను ఒకేసారి విత్తడం ద్వారా మాత్రమే ఈ పురుగును నివారించుకోవచ్చన్నారు. నాణ్యమైన పత్తిని పొందాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. పత్తిలో గులాబీ రంగు పురుగుల సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో పీబీనాట్స్‌(ముడులు) వాడటం ద్వారా సంపర్కాన్ని నిరోధించి గులాబీరంగు పురుగుల ఉధృతిని తగ్గించవచ్చన్నారు. పీబీనాట్స్‌ వాడి పత్తి పొలాలను రైతులతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో లాంఫాం ఏడీఆర్‌ డాక్టర్‌ జీవీ ప్రసాదరావు, సౌత్‌ ఆసియా బయోటెక్నాలజీ పౌండర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భగీరధ్‌ చౌదరి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోవింద్‌గుజర్‌, కాటన్‌ కార్పొరేషన్‌ డీడీఈ స్వప్నిత్‌, జిల్లా ఫిబినాట్స్‌ ప్రాజెక్ట్‌ ఇంచార్జ్‌ డాక్టర్‌ డయానా, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి శ్రీలక్ష్మి, డాక్టర్‌ ఎం సుధారాణి, డాక్టర్‌ ఎన్‌ వెంకటలక్ష్మి, డాక్టర్‌ శ్రీకాంత్‌, డాక్టర్‌ కె శివారెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ రామ్‌మోహన్‌, వీఏఏ రవి, రైతులు తదితరులున్నారు.

రైతులు సమష్టిగా నియంత్రణకు పూనుకోవాలి యాజమాన్య పద్ధతులతోనే నాణ్యమైన పత్తిదిగుబడి సాధ్యం కేంద్ర పత్తి పరిశోధన స్థానం డైరెక్టర్‌ డాక్టర్‌ వై.జి.ప్రసాద్‌

మరిన్ని వార్తలు