రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

11 Oct, 2019 19:10 IST|Sakshi

వాటర్‌ గ్రిడ్‌ పథకంపై మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి: 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలన్నదే లక్ష్యమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వాటర్‌గ్రిడ్‌ పథకంపై  ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.  రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు డిజైన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు పైప్‌లైన్ల ద్వారా నీటి సరాఫరా అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో దీర్ఘకాలంగా భూగర్భజలాల వినియోగిస్తున్నారని...ఆ మూడు జిల్లాల్లో సర్ఫేస్‌ వాటర్‌ సరఫరాకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్‌ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని..ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చిత్తూరు, కడప, నెల్లూరు,ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. గిరిజన గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని.. జిల్లాల్లో జలాశయాలు, నదులు, నీటివనరుల లభ్యతపై సమగ్ర అంచనాలు తయారు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు