వారు సరిహద్దు దాటాలని చూస్తున్నారు : ఆర్మీ అధికారి

11 Oct, 2019 19:03 IST|Sakshi

జమ్ము కశ్మీర్‌ : ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని వేర్వేరు శిబిరాల్లో దాదాపు 500 వందల మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నారని నార్తర్న్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. అంతేకాక, ఆంక్షలు సడలిస్తే అశాంతి రేపడానికి రెండు నుంచి మూడొందల మంది తీవ్రవాదులు కశ్మీర్‌లోనే ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం మీడియాతోమాట్లాడుతూ ఆయన ఈ విషయాలు ధృవపరిచారు. సరిహద్దు అవతల ఉన్నవారికి పాక్‌ సైన్యమే ఆయుధాలను, నిధులను సమకూర్చుతూ లాంచ్‌పాడ్‌ శిక్షణను కూడా ఇస్తున్నట్టు తమకు గట్టి సమాచారం ఉందని రణబీర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల పాక్‌ నుంచి పంజాబ్‌లోకి డ్రోన్లు రావడంపైనా ఆయన స్పందించారు. ఎలాగైనా జమ్ము కశ్మీర్‌లో అలజడులు సృష్టించాలనే లక్ష్యంతో దాయాది దేశం వేస్తున్న కొత్త తరహా ఎత్తుగడలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను ధ్వంసం చేసే శక్తితో పాటు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్ధ్యం మన సైన్యానికుందని వెల్లడించారు. పాకిస్తాన్‌ ఎలాంటి కుట్ర పన్నినా, ఎంతగా ప్రయత్నించినా వారి ఆటలు సాగనివ్వమని సింగ్‌ స్పష్టం చేశారు.   
 

>
మరిన్ని వార్తలు