రోడ్డుపై రచ్చ

17 Oct, 2017 17:20 IST|Sakshi

 యువకుడిని వాహనం రికార్డులు చూపమన్న ట్రాఫిక్‌ పోలీస్‌

 అంతలోనే పోలీస్, యువకుడి మధ్య వాగ్వివాదం

 ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో గందరగోళం

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): పబ్లిక్‌తో ఫ్రెండ్లీగా ఉండాల్సిన పోలీస్‌ వ్యవస్థ ఆ దిశగా పనిచేయడం లేదు. హత్యా నేరాల్లో పోలీసుల పాత్ర ఉంటుండడం... పోలీసు ఉన్నతాధికారులే ఆ విషయాలను తేల్చి చెప్పడంతో పబ్లిక్‌కు కూడా పోలీస్‌ వ్యవస్థపై నమ్మకం లేకుండాపోతోంది. దీంతో పోలీసులపై పబ్లిక్‌ తిరగబడుతున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరంలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అక్కడ ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ ఓ ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేయడం... కోపావేశంతో ఆ ద్విచక్ర వాహనదారుడు కూడా విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌పై దాడి చేయడం చకాచకా జరిగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే... ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై ఉదయం 11 గంటల ప్రాంతంలో సౌత్‌ జైల్‌రోడ్డు (విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల)వైపు వెళ్తున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆ ద్విచక్ర వాహనదారుడిని ఆపి రికార్డులు చూపించమన్నాడు. చూపించాడో.. లేదో.. తన వద్ద ఉన్నాయో లేవో తెలీయదు గానీ.. వారిద్దరి(పోలీస్, ద్విచక్ర వాహనదారుడి మధ్య) మధ్య వాగ్వివాదం నెలకొంది.

ఆ తగదా ముదరడంతో యువకుడిపై పోలీస్‌ చేయి చేసుకున్నాడు. అవమానం భరించలేక అసహనం... ఆగ్రహంతో ఆ యువకుడు తన సోదరుడికి ఫోన్‌ చేసి పిలిచాడు. వీరిద్దరూ విధుల్లో ఉన్న ఆ ట్రాఫిక్‌ పోలీస్‌పై దాడికి దిగారు. ఇంతలో పోలీస్‌ రక్షక్‌ వాహనం అక్కడకు వచ్చింది. రక్షక్‌లో ఉన్న పోలీసులు ఆ యువకుల మెడ పట్టుకుని వాహనంలోకి తీసుకెళ్తుంటే... మేము వస్తామన్నాం కదా... ఎందుకు రౌడీలులా తీసుకెళ్తున్నారంటూ ఎదురించారు. ఆ తర్వాత రక్షక్‌ వాహనంలో కూడా పోలీసులు.. ఆ యువకుల మధ్య వాగ్వివాదం జరిగింది. తర్వాత ఆ ఇద్దరు యువకులను పోలీసులు రెండో పట్టణ పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు. టూ టౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ పైడిరెడ్డి ఫిర్యాదు మేరకు యువకులు ఆళ్ల అనిరుధ్, ఆళ్ల శ్రీవర్షపై కేసు నమోదు చేశారు.  అయితే ప్రశాంత విశాఖలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికితోడు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు