‘పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదు’

16 Nov, 2019 19:28 IST|Sakshi

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. 10 నుంచి 15 రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై కసరత్తు జరుగుతున్నట్టు తెలిపారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశంలో స్పీకర్‌ పాల్గొన్నారు. అనంతరం ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లాలంటే రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే అనర్హత తప్పదని ఆయన స్పష్టం చేశారు.

‘సభా నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చారు. ఎవరు పార్టీ ఫిరాయించిన అనర్హత వేటు వేయమన్నారు’ అని తెలిపారు. డిసెంబర్ 17 నుంచి 21వరకు డెహ్రాడూన్లో స్పీకర్లు సదస్సు జరగనుందని తెలిపారు. చట్టసభల కార్యకలాపాలను డిజిటల్‌ రూపంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. పేపర్‌ లెస్‌ గవర్నెన్స్‌ను తీసుకురావాలనే ఉద్దేశం ఉందని, చట్టసభల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు త్వరితగతిన సమాధానాలు పంపేందుకు ఈ విధానం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పీకర్‌  వెల్లడించారు.

మరిన్ని వార్తలు