ఐదుగురిని మింగిన ఆక్వా ప్లాంట్‌

31 Mar, 2017 02:00 IST|Sakshi
ఐదుగురిని మింగిన ఆక్వా ప్లాంట్‌

- మొగల్తూరులో ఘోరం
- రొయ్యల ఫ్యాక్టరీలో విరజిమ్మిన విష వాయువులు
- ఐదుగురి దుర్మరణం


సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం పెనువిషాదం చోటుచేసుకుంది. మొగల్తూరు పంచాయతీ పరిధిలోని నల్లంవారి తోట గ్రామంలోని ఆనంద ఆక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. ప్లాంట్‌కు సంబంధించిన వ్యర్థాలు నిల్వ ఉండే ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారంతా 30 ఏళ్లలోపు వారే. కుటుంబాలకు వారే ఆధారం. ఈ ఘోరం జరిగిన వెంటనే ప్లాంట్‌ నిర్వాహకులు, కీలక ఉద్యోగులు ఉడాయించారు. ఐదుగురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నా పోలీసులు పట్టించుకోక పోవడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్‌పై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఫ్యాక్టరీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఆనంద ఆక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకును శుభ్రం చేసేందుకు గురువారం ఉదయం 8 గంటలకు దినసరి కూలీలుగా పని చేస్తున్న యువకులు సిద్ధమయ్యారు. తొలుత నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22) ట్యాంకులోకి దిగాడు. ఒక్కసారిగా విషవాయువు వెదజల్లడంతో ట్యాంకులోనే కుప్పకూలిపోయాడు. లోపల ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో మొగల్తూరుకి చెందిన తోట శ్రీనివాస్‌ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22) లోపలకు దిగారు.

వాళ్లిద్దరూ కూడా బయటకు రాకపోవడంతో మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్‌ (23), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగి క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది యాజమాన్యానికి తెలియజేయగా.. మేనేజర్‌తో పాటు కీలక ఉద్యోగులు అక్కడి నుంచి పారిపోయారు. ఐదుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసి గ్రామస్తులు, మృతుల బంధువులు ఘటన స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. అప్పటికే పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తుల్ని అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేయగా.. వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.

రోజుల తరబడి నిల్వ చేయడం వల్లే..
ఇక్కడికి  సమీపంలోని తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సమీప 40 గ్రామాల్లో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలో ఆనంద అక్వా ప్లాంట్‌ వ్యర్థాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో వదలటాన్ని నిలుపుదల చేసి తాత్కాలికంగా నిర్మించిన ట్యాంకులోకి వదులుతున్నారు. ట్యాంకులోకి చేరిన వ్యర్థాలను ప్రతిరోజు రీసైక్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ పనులేవీ చేయడం లేదు. ట్యాంక్‌లోని వ్యర్థాలను బయటకు వదిలి నెల రోజులు దాటిందని చెబుతున్నారు.దీని వల్ల విష వాయువులు వెలువడ్డాయి.

>
మరిన్ని వార్తలు