ఓటరు మెచ్చని వ్యతిరేకతావాదం | Sakshi
Sakshi News home page

ఓటరు మెచ్చని వ్యతిరేకతావాదం

Published Fri, Mar 31 2017 1:52 AM

ఓటరు మెచ్చని వ్యతిరేకతావాదం - Sakshi

మోదీ ప్రాబల్యం పెరగడాన్ని మోదీ వ్యతిరేకతతో ఎదుర్కొనలేరు. నరేంద్ర మోదీ కేవలం ఒక వ్యక్తి కాదు... సాధారణ ఓటర్లలో బలమైన, నిర్ణయాత్మకమైన నేత కావాలని ఉన్న కాంక్షకు ప్రతీక. తమ సొంత సంస్కృతి అంటే గౌరవం, భౌతిక సంక్షేమం పట్ల ఆశలూ వారిలో ఉన్నాయి. మోదీ ఆ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు సృష్టించిన శూన్యంలోకి ఆయన ప్రవేశించారు. నూతన సూత్రాలు, తాజాశక్తులతో ఈ శూన్యాన్ని నింపడం తప్ప, మోదీని ఎదుర్కొనే దారి మరేదీ లేదు.

ఉదారవాద భారతాన్ని నరేంద్ర మోదీ అనే భూతం వెంటాడు తోంది. గత మూడేళ్లుగా మోదీ ప్రతిష్ట, బలం, ప్రభావం ఇనుమ డించాయి. ప్రత్యర్థులు నిరంతరం ఆయనతో పోరాడుతూనే ఉన్నారు, పరాజయాల పాలవుతూనే ఉన్నారు. ఆయనతో తలపడటాన్ని నివా రించడం లేదా తప్పించుకోవడం సైతం వారు చేయలేరు. ప్రతి పోరాటంలోనూ ఆయన మరింత బలవంతునిగా మారుతున్నారు.  మోదీ జన సమ్మోహక శక్తులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన డానికి ఇటీవలి శాసనసభ ఎన్నికలే నిదర్శనం. ఆ నడుమ ఈ విష యంలో సందేహాలు కలుగకపోలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోని ఆయన విజయయాత్రకు మొదట ఢిల్లీలోనూ, ఆ తర్వాత బిహార్‌ లోనూ గండి పడింది. ఆ రెండు ఎదురుదెబ్బలూ కలసి పరిస్థితుల కారణంగానే మోదీ ప్రాబల్యం పెరిగిందనీ, ప్రతిపక్షాల అనైక్యతే దానికి ప్రాతిపదికనీ భ్రమింపచేశాయి. కేరళ నుంచి మణిపూర్‌ వరకు బీజేపీ చొచ్చుకుపోవడమూ, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి పరాజయమూ హఠాత్తుగా ఆ భ్రమను పటాపంచలు చేశాయి. మోదీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటారనే ఆశలు సైతం మటుమా యమయ్యాయి.

ఊహించని ఈ పరిణామానికి ప్రతిపక్షం తనకు తెలిసిన ఒకే ఒక్క పద్ధతిలో ప్రతిస్పందించింది. మోదీ వ్యతిరేకతావాదాన్ని ఆశ్ర యించింది. అది పలు రూపాలలో సాగింది. మోదీ తప్పులు చేయడం మొదలై, ఆ తప్పులు పేరుకుపోతుండటంతో ఇక ఆ గాలిబుడగ తనంతట తానుగానే బద్ధలై పోతుందని ప్రతిపక్షాలు కొన్నిసార్లు భావించాయి. ఆయ నను ఆవరించి ఉన్న నైతికతా కవచాన్ని ఊడిపోయేలా చేయాలని ఆయనపై వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు లేదా ఆయనను ఓడించే లక్ష్యంతో మోదీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఒక్కటి చేశారు. వీటిలో ఏదీ పని చేస్తున్నట్టు కనిపిం చడంలేదు. మోదీ వ్యతిరేక రాజకీయాలు ప్రజల కళ్లకు ఉత్త మోదీ వ్యతి రేకతగా మాత్రమే కనిపిస్తున్నాయి.

ప్రతికూలతలుగా మారని తప్పులు
అలా అని ఆయన ఏ తప్పులూ చేయలేదని కాదు. అధ్వానంగా రూపొం దించి, అడ్డగోలుగా అమలుచేసిన పెద్ద నోట్ల రద్దు... ప్రధానిగా ఎవరైనాగానీ చేయగలిగిన అతి పెద్ద తప్పు. దీని వలన విశాల ప్రజానీకం లెక్కగట్ట లేనం తటి, నివారించదగిన బాధలను అనుభవించాల్సి వచ్చింది. అయినా, ఘోరమైన ఈ తప్పును తట్టుకుని మరీ మోదీ ప్రజాకర్షణ శక్తి మనగలిగింది. ఈ వైఫల్యాన్ని ఆయన, పేదల మిత్రునిగా తన ప్రతిష్టను పెంపొందించు కోవడానికి వాడుకుని ఉండటం మాత్రమే జరిగి ఉండొచ్చు. అలాగే, పాకిస్తాన్‌ పట్ల మోదీ విధానం ఒక కొస నుంచి మరొక కొసకు కొట్టుకుపోతూ వచ్చింది, పలు తొందరపాటు చర్యలను చేపట్టడం జరిగింది. ఫలితంగా మన సరిహద్దులు, భద్రతా బలగాలు మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొ నాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రజలు ఆయనను దేశ భద్రతా పరి రక్షకునిగా చూస్తూనే ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోన్ని దుర్భర దైన్య పరిస్థితి వరుసగావచ్చిన కరువులతో మరింత అధ్వానమైంది. అయినా మోదీ ప్రభు త్వం వారి కోసం చేసింది దాదాపుగా ఏమీ లేదు. స్వతంత్ర భారత చరిత్ర లోనే ఆయన అత్యంత రైతు వ్యతిరేక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తు న్నారనేది నిస్సందేహం. కానీ ఆయన పార్టీకి గ్రామీణ ఓటర్లు ఒకదాని తర్వాత ఒకటిగా విజయాలను అందిస్తున్నారు. మోదీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ వంటి ఆచరణాత్మక పథకాలు చెప్పుకోదగినంతటి ఫలితాలను సాధించింది లేదు. అయినా ఈ ఉద్యమాలను చేపట్టిన ప్రతిష్టను ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. మోదీ చేసిన తప్పులు సైతం రాజకీయ ప్రతికూలతలుగా మారలేదు.

బెడిసికొడుతున్న ప్రతిపక్షాల దాడులు
ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకతను కలిగించడంలో సఫలం కాలేదు. అలా అని ఆయ నను లక్ష్యంగా చేసుకుని దాడి చేయదగిన అంశాలేవీ లేవనీ కాదు. రాజకీయ అవినీతిపై ఇంత వరకు ఏ ప్రధానిపైనా లభించనంతటి బలమైన ఆధారా లుగా బిర్లా–సహారా పత్రాలు మోదీకి వ్యతిరేకంగా నిలుస్తాయి. ఒకప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా నడిచిన సుప్రసిద్ధమైన నగ ర్వాలా కేసులో ఎంతో నిగూఢత ఉంది. కానీ నగర్వాలాకు ఇందిరాగాంధీతో సంబంధాలున్నాయనడానికి బహిరంగ ఆధారాలు లభించలేదు. ఇక బోఫోర్స్‌ కేసులో మధ్యవర్తులకు చెల్లించిన ముడుపులకు పత్ర రూప ఆధా రాలను సంపాదించలేకపోయారు. ఆ దర్యాప్తు రాజీవ్  గాంధీ వద్దకు వచ్చాక అక్కడే నిలిచిపోయింది. ప్రధానికి రాజకీయపరమైన చెల్లింపులు జరిగి నట్టుగా దస్తావేజుల రూపంలో ప్రత్యక్ష అవినీతి ఆధారాలు దొరికిన మొట్ట మొదటి  కేసు బిర్లా–సహారా పత్రాలదే. అయినా కోర్టు కదలలేదు, మీడియా ఆ కేసు విషయంలో విముఖత చూపింది. ఇక ప్రజలు ఆ ఆరోపణను  పూర్తిగా  అంగీకరించలేదు.

రఫేల్‌ ఒప్పందం విషయంలో, అంబానీ సోదరులలో ఒక రికి భారీ మేళ్లను చేకూర్చినట్టు వచ్చిన ఆరోపణల విషయంలోనూ అదే జరి గింది. మోదీ విద్యార్హతలపై వచ్చిన ప్రశ్నలను ఎలా అణగదొక్కారనేది ఇబ్బం దికరమైన పలు ప్రశ్నలు తలెత్తేలా చేసింది. కానీ బహిరంగంగా ఈ ప్రశ్నలను లేవనెత్తడానికి ఇష్టపడేవారు ఎందరో లేరు. మోదీని లక్ష్యంగా చేసుకుని చేసే దాడి ఏదైనా ప్రతిపక్షాలకే బెడిసి కొడుతుంది. కుల కూటముల పాత ఎత్తుగడలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయవు. సమాజ్‌వాదీ పార్టీ యాదవ్‌–ముస్లిం సమ్మేళనం, బీఎస్‌పీ దళితుల సమీకరణ కూటములకు వ్యతిరేకంగా ప్రతి కూటములను నిర్మించడంలో అమిత్‌ షా పరిపూర్ణ ప్రావీణ్యాన్ని సంపాదించారు. 2014లోలాగా బీజేపీ తన సంప్ర దాయక ఎగువ కులాల పునాదితో పాటూ దిగువనున్న ఓబీసీలను, మహా దళితులను సైతం సమీకరించింది. ఆ కుల కూటమికి మోదీ అదనపు ఉత్సా హోత్తేజాలను చేకూర్చారు. మోదీకి వ్యతిరేకంగా కుల కూటమి వ్యూహం ఉత్తరప్రదేశ్‌లో పనిచేయలేదంటే మరెక్కడా పనిచేయకపోవచ్చు.

గత్యంతరం లేని స్థితిలో ప్రతిపక్షాలు బృహత్‌ కూటమి వ్యూహాన్ని చేపట్టాయి. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ప్రధాన వ్యూహం బహుశా ఇదే కావచ్చు. కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే బీజేపీ యేతర పార్టీలన్నిటి జాతీయ స్థాయి బృహత్‌ కూటమిని డిమాండు చేస్తున్నారు. కనీసం లోక్‌సభ ఎన్నికల వరకైనా ఎస్పీ, బీఎస్పీల మధ్య కూటమిని తోసిపుచ్చలేకపోవచ్చు. ఒడిశాలో బీజేపీ ఎదుగుదలకు భయపడి నవీన్‌ పట్నాయక్‌ కాంగ్రెస్‌తో చెయ్యి కలపాలని కోరు కోవచ్చు. వామపక్షాలను మినహాయించిన కూటమి కోసం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలపరంగా తుడిచిపెట్టుకు పోకుండా ఉండాలని వామపక్షాలు ఆ కూటమితో కలవడానికి మొగ్గు చూప వచ్చు. ఆర్జేడీ, జేడీయూ కూటమి ఇంతవరకు మనగలిగింది. కాబట్టి బీజేపీ వ్యతిరేక జాతీయ బృహత్‌ కూటమికి అందిరికీ ఆమోదయో గ్యుడైన నేత నితీష్‌ కుమార్‌  కావచ్చు.

అలాంటి కూటమికి 2019 ఎన్నికల్లో ఉన్న అవకాశాలపై ఇప్పుడే జోస్యం చెప్పే పని మరీ ఇంత తొందరగా చేయలేం. అయినా 1971లో ఏం జరిగిందో గుర్తుచేసుకోవడం సందర్భోచితమే కావచ్చు. పెరుగు తున్న ఇందిరాగాంధీ జనాకర్షణ శక్తిని ఎదుర్కోవాల్సివచ్చిన మొత్తం ప్రతిపక్షాలు–జనసంఘ్, సోషలిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ (ఓ), బీకేడీలు బృహత్‌ కూటమిగా ఒక్కటయ్యాయి. ఆ ఎన్నికల్లో ఘన విజయం ఆ కూటమికి గాక, ఇందిరా కాంగ్రెస్‌కు లభించింది. తన ప్రత్యర్థులను మట్టికరిపించడానికి ఆమె ఒకే ఒక్క సరళమైన వాక్యాన్ని ప్రయోగిం చారు ‘‘యే కెహెతేహై ఇందిరా హఠావో, మై కెహెతేహూం గరీబీ హఠావో’’ (వాళ్లు ఇందిరను తొలగించండి అంటున్నారు, నేను పేదరికాన్ని తొలగిం చండి అంటున్నాను). మోదీ ఇప్పటికే అలాంటి జవాబును సంకేతించారు. అలాంటి కూటమి మోదీ పట్ల ప్రజల సానుభూతి మొగ్గేట్టు చేయడం పూర్తిగా సాధ్యం. బాధితుని పాత్రను పోషించడంలో ప్రవీణుడైన మోదీ సైతం ఇంది రాగాంధీలా ఆలాంటి నినాదం ఒక దానితో ముందుకు రావచ్చు. ఫలితాలు అప్పటికంటే అంత భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు.

జాతీయ బృహత్‌ కూటమి మోదీకి వరమా?
ఈ నేపథ్యంలో ఆర్జేడీ–జే డీయూల బృహత్‌ కూటమి బిహార్‌లో సఫలం కావడం తప్పుడు సంకేతాన్ని పంపిందనేది స్పష్టమే. బిహార్‌లోని ఒకటి, రెండు స్థానాల్లోని పార్టీలు రెండూ, మూడో స్థాయిలో ఉన్న ఒక పార్టీని ఓడిం చడానికి ఒక్కటయ్యాయి. ఆ పరిస్థితి మరో చోట పునరావృతమయ్యే అవ కాశం లేదు. మోదీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో బీజేపీయేతర పార్టీల న్నిటితో కూడిన అతుకుల బొంత కూటమిని ఏర్పరచినా ఆది భారత ఓట ర్లను ఉత్తేజితులను చేయలేదు.
ప్రతిపక్షపార్టీల రాజకీయం ఈ నిరాకరణలో బతకడానికి స్వస్తి పల కాల్సిన సమయమిది.

మోదీ ప్రాబల్యం పెరగడాన్ని మోదీ వ్యతిరేకతతో ఎదుర్కొనలేరు. నరేంద్ర మోదీ కేవలం ఒక వ్యక్తి కాదు. తమ సొంత సంస్కృతిపట్ల గౌరవం, భౌతిక సంక్షేమం పట్ల ఆకాంక్షలు గల బలమైన, నిర్ణయాత్మకమైన నేత కావాలన్న సాధారణ ఓటర్ల వాంఛకు ఆయన ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు సృష్టించిన శూన్యంలోకి ఆయన ప్రవేశించారు. నూతన సూత్రాలు, తాజా శక్తులతో ఈ శూన్యాన్ని నింపితే తప్ప మోదీని ఎదుర్కొనే మార్గమే లేదు. వ్యవస్థితమైన ప్రతిపక్ష పార్టీ లకు అది చాలా పెద్ద కర్తవ్యమనే అనిపిస్తోంది.


యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986 ‘ Twitter : @_YogendraYadav

Advertisement

తప్పక చదవండి

Advertisement