ఆదిత్యా... నీకు దిక్కెవరు? 

28 Feb, 2020 08:49 IST|Sakshi
గత ప్రభుత్వ హయాంలోనే దుకాణ సముదాయాలుగా మారిన ఆలయ భూములు

అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి భూములు  అన్యాక్రాంతం

41.30 ఎకరాల ఇనాం భూములు హాంఫట్‌..!

బడ్జెట్‌ హోటల్‌ సమీపంలో 95 సెంట్ల భూమి కూడా పరులపరం 

గత ప్రభుత్వ హయాంలో మరో భూ బాగోతమిది

ఆయన అందరికంటే ఎత్తులో ఉంటూ అందరికీ వెలుగులు ప్రసాదిస్తాడు.. అయితే ఆయన కొలువుకు చెందిన భూములను మాత్రం కాపాడుకోలేకపోతున్నాడు.. సర్వదిక్కులను శాసిస్తున్న భానుడే దిక్కులేక మిన్నకుండిపోతున్నాడు.. కోట్లాది రూపాయల విలువైన భూములను అన్యాకాంత్రం చేసుకుని ఏళ్ల తరబడి ఫలసాయం పొందుతున్నప్పటికీ అధికారులు సైతం కిమ్మనకపోవడం చర్చనీయాంశమైంది.  

అరసవల్లి: శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయ భూముల్లో అత్యధిక శాతం ఇనాం కింద ఆలయ అర్చకుల వద్దనే ఉండగా, మిగిలినవి ఆక్రమణలకు గురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చాలాచోట్ల జరిగిన భూ ఆక్రమణల్లాగే.. అరసవల్లి ఆలయానికి చెందిన భూములను కూడా స్థానిక నేతల అండదండలతో అక్రమార్కులు కాజేశారు. గత ఐదేళ్లలోనే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న కొన్ని ఎకరాల భూములను ఇష్టానుసారంగా రెవన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేసేసి టీడీపీ నేతలు అనుకూలురకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆలయానికి చెందిన భూములు అపార్ట్‌మెంట్లుగానూ, భవనాల సముదాయాలు, దుకాణాల సముదాయాలుగా మారిపోయాయి.

ఆదిత్యుని భూముల లెక్కలివే.....! 
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి సుమారు 120 ఎకరాలకు పైగానే భూమి ఉంది. 1932 నాటి మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన డిక్రీ ఆధారంగా మొత్తం 53.24 ఎకరాల భూమిని ఆలయ వంశపారంపర్య అర్చకులకు జీతాలకు బదులుగా సరీ్వస్‌ ఇనాంగా అప్పగించారు. ఇందులో భాగంగా ఉన్న 2.48 ఎకరాల భూమిలో కొంత భాగం టూరిజం బడ్జెట్‌ హోటల్‌కు, మరికొంత భాగం టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇవి కాకుండా మరో 27.91 ఎకరాల భూమి ప్రస్తుతానికి లీజుల కింద కేటాయించారు. వీటి నుంచి వార్షిక ఆదాయం 1.71 లక్షల వరకు వస్తోంది. ఇవన్నీ కాకుండా మరో 41.30 ఎకరాల వరకు భూమిని దశాబ్దాల కాలం క్రితమే ఆలయంలో పనిచేస్తున్న బోయిలు, దివిటీలు, చాకళ్లు, భజన కర్తలు, వేదపారాయణదారులకు, నాయీ బ్రాహ్మణులకు వాయిద్యాల కర్తలకు, స్వామి ఆలంకరణకు గాను పూల తోటల పెంచడానికి గానూ అప్పట్లో సరీ్వస్‌ ఇనాం కింద కేటాయించారు. అయితే దాదాపుగా ఈ మొత్తం ఇనాం భూమి చేతులు మారిపోయాయి. దీంతో ఆలయ భూముల లెక్కల్లోనే ఈ వివరాలు లేకుండా పోయాయి. అయితే పాత రికార్డుల్లో ఉన్న వాస్తవ లెక్కలను ప్రస్తుతం కని్పంచకుండా గతంలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారు. దీంతో ప్రస్తుతానికి ఆలయానికి తాజా రికార్డుల ద్వారా 83.99 ఎకరాల భూములున్నట్లుగా చూపిస్తున్నారు. అయితే ప్రాపర్టీ రిజిస్టర్‌లో మాత్రం ఇప్పటికీ ఇనాం భూములుగా ఎకరాల కొద్దీ భూములు కన్పిస్తున్నాయి.

ఇనాం భూములన్నీ హాంఫట్‌...! 
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి వివిధ రకాలుగా సేవలందించే సేవకులకు గాను అప్పట్లో సరీ్వస్‌ ఇనాం కింద సుమారు 41.30 ఎకరాల భూములను ఇచ్చినట్లుగా పాత రికార్డులు చూపిస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎన్నో చేతులు మారిపోవడంతో ఆలయ గత ఆస్తులుగానే రికార్డుల్లో ఉండిపోయాయి. అరసవల్లి మిల్లు కూడలి సమీపంలో సాగునీటి కాలువకు ఆనుకుని ఇరువైపులా సర్వే నెంబర్‌ 12తోపాటు పలు సర్వే నెంబర్లలో ఆలయానికి భూములున్నాయి. ఇందులో భాగంగా 12/3, 12/4 సర్వే నెంబర్లులో మొత్తం 0.95 ఎకరాల భూమి కూడా తాజాగా ఆక్రమణలకు గురయ్యింది. అయితే ఈ భూములతో పాటు పక్కనే 2.68 ఎకరాల భూమిలోనే రాష్ట్ర పర్యాటక శాఖ బడ్జెట్‌ హోటల్‌ నిర్మాణం, టీటీడీ కళ్యాణమండపాలను నిర్మించేందుకు కేటాయించారు.

ఇదిలావుంటే 12/3, 12/4 సర్వే నెంబర్లలో రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే సూర్యనారాయణ స్వామి వారికి చెందినట్లుగానే ఉన్నాయి. అయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ను కూడా నిర్మించారు. ఇదే ప్రాంతంలో సుమారు ఐదారు ఎకరాల్లో పెద్ద పెద్ద భవనాలు కూడా వెలిసిపోయాయి. అలాగే ఆక్రమణ స్థలాల్లో రోడ్డుకు ఆనుకుని షాపింగ్‌ కాంప్లెక్స్‌ను కూడా నిర్మించారు. ఇదంతా ఓ స్థానికుడు స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుతోనే వెలుగులోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇనాం భూములన్నీ ఇలాగే అన్యాక్రాంతమయ్యాయనే వాదనకు ఇదే పెద్ద ఉదాహరణగా నిలిచింది.   

ఆక్రమణ భూములపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నాం 
అరసవల్లి ఆలయానికి చెందిన కొన్ని భూములు ఆక్రమణకు గురైన విషయం దృష్టికి వచ్చింది.. ఇటీవల ‘స్పందన’ ద్వారా పలు భూముల అన్యాక్రాంతానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో.. ఆలయ భూములను సర్వే చేయించి ఆక్రమణలను గుర్తించాం. దీనిపై ఆలయ భూములను అనుభవంలోకి తీసుకున్న వారిపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు..
– వి.హరిసూర్యప్రకాష్‌, ఆలయ ఈవో


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా