'నాగార్జున'లో ర్యాగింగ్ నిజమే

2 Aug, 2015 09:59 IST|Sakshi
'నాగార్జున'లో ర్యాగింగ్ నిజమే

ఆర్కిటెక్చర్ కళాశాల హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి స్పష్టీకరణ

సాక్షి, గుంటూరు, ఏఎన్‌యూ: నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతూనే ఉందని వర్సిటీ మహిళా వసతిగృహాల చీఫ్ వార్డెన్ సీహెచ్ స్వరూపరాణి స్పష్టం చేశారు. వర్సిటీలో ర్యాగింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీ నరసింహారెడ్డి వర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు, వార్డెన్ స్వరూపరాణిలను ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు.

శనివారం వారిద్దరూ న్యాయ సేవాధికారసంస్థ ముందు హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి, మహిళా వసతిగృహాలకు సంబంధించిన పలు అంశాలపై వివరణిచ్చారు. వీరు 7న మరోమారు విచారణకు హాజరుకానున్నారు. అనంతరం వార్డెన్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘వర్సిటీలో ర్యాగింగ్ ఉంది. గతంలోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగాయి. భాగ్యలక్ష్మి అనే విద్యార్థినిపై ర్యాగింగ్ జరిగిన ఘటనకు సంబంధించి గతంలో వర్సిటీ నియమించిన సి.రాంబాబు కమిటీ కూడా ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించింది.

దీంతో ఐదుగురు విద్యార్థినుల్ని హాస్టల్‌నుంచి పంపించేశాం. అయితే వారిపై విద్యాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  పోలీసులకు ఫిర్యాదు చేయలేదు’’ అని తెలిపారు.  ప్రిన్సిపల్ బాబూరావు ఆదేశాలతోనే విద్యార్థులు రిషితేశ్వరి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారన్నారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. మృతదేహాన్ని తరలించాలని తానెవర్నీ ఆదేశించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకే పార్టీలో డ్యాన్స్ చేశా నన్నారు.
 
హాస్టల్ వార్డెన్ రాజీనామా..
వర్సిటీలో బాలికల వసతిగృహాల వార్డెన్ బాధ్యతలకు స్వరూపరాణి జూలై 30నే రాజీనామా చేసినట్టు వెల్లడైంది. రిషితేశ్వరి ఘటన అనంతరం తనపై విమర్శలు రావడంతో కలత చెంది రాజీనామా చేసినట్లు ఆమె తెలిపింది. తాను వార్డెన్‌గా నియామకమై జూలై 6కు మూడేళ్లు దాటిందని, పలుమార్లు రిలీవ్ చేయాలని కోరినా కొనసాగించారన్నారు. కాగా రిషితేశ్వరి ఘటనలో విచారణకు సహకరించేందుకు 30వరకు వార్డెన్‌గా కొనసాగానన్నారు.
 
విచారణ కమిటీ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై నియమించిన విచారణ కమిటీ గడువును  ఏపీ ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రాసిన లేఖ మేరకు గడువు పెంచినట్లు  విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు