జీవితానికీ మరణానికీ మధ్య ‘మత’ గీత మెమన్! | Sakshi
Sakshi News home page

జీవితానికీ మరణానికీ మధ్య ‘మత’ గీత మెమన్!

Published Sun, Aug 2 2015 12:51 AM

జీవితానికీ మరణానికీ మధ్య ‘మత’ గీత మెమన్!

తమ మతం కారణంగానే తాము ఈ దేశంలో శిక్షకు గురవుతున్నట్లు ముస్లింలలో పలువురు భావిస్తున్నారన్న భావనను యాకూబ్ మెమన్ ఉరి ఘటన బలపరుస్తోంది. మెమన్ నిజంగా తప్పు చేసినప్పటికీ, తన మతం కారణంగానే అతడిని ఉరితీయడానికి ప్రభుత్వం అంత ఆత్రుతను ప్రదర్శించిందన్న ముస్లింల ఆవేదనను ఇది స్పష్టం చేస్తోంది. మెమన్ ఉరితీత ఘటన కూడా ప్రజలను వేరు పరచేదే. ఇది కూడా పెద్ద స్థాయిలో విషం చిమ్మనుంది.
 
 మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అంత్యక్రియలు జరిగిన రోజే ఉరిశిక్షపాలైన ఉగ్రవాది యాకూబ్ మెమన్‌కి అంత్యక్రియలు నిర్వహించారు. మెమన్ అంత్యక్రియల గురించి నివేదించవద్దని ముంబై పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అదే సమయంలో సైనిక వందనంతో సహా ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం కలాం అంత్యక్రియలను ఘనంగా నిర్వహించింది. (అణు బాం బుల సృష్టికర్తగా, వాటిని మోసుకుపోయే క్షిపణుల సృష్టికర్తగా కీర్తిపొందిన ఆయ నకు ఇది అసలైన నివాళి).
 
 తన భావ వ్యక్తీకరణా హక్కులను కాపాడుకోవడంలో తీవ్రంగా పోరాడే స్వభావమున్నప్పటికీ, మీడియా రెండు కారణాలతో మెమన్ అంత్యక్రియల ప్రసారంపై నిషేధాన్ని అంగీకరించింది. ఉరిశిక్ష విధించిన వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా పోటెత్తి వచ్చే ముస్లిం జనసందోహం అతడికి మద్దతు ప్రకటించే వార్తలను ప్రచారం చేసినట్లయితే, ఇప్పటికే మతపర హింసలో తన వంతు వాటా కంటే అధిక భాగం కలిగి ఉన్న ముంబై వంటి నగరంలో ప్రజలు మతాల వారీగా వేరుపడిపోవడం జరుగుతుందనే ఆందోళనతో మీడియా ఏకీభవించింది. ఇది మొదటి కారణం.
 
 ఇక రెండో కారణం. అప్రియత్వానికి సంబంధించింది. జనం గౌరవించనప్ప టికీ, ఉరిశిక్షకు గురైన వ్యక్తికి ప్రజల నుంచి సానుభూతి లభించడం అనే నిజాన్ని వెలుగులోకి తీసుకురావడమనేది వినడానికి అప్రియంగా ఉండవచ్చు. ఇలాంటి అప్రియ ఘటనలకు ప్రచారం కల్పించకూడదన్నదే తమ వైఖరి అంటూ కొన్ని చానళ్లు ఆన్-స్క్రీన్ బ్యానర్లను కూడా ప్రకటించాయి.
 
 మెమన్ అంత్యక్రియలకు ఎంతమంది హాజరయ్యారనే విషయంలో భారతీ యులు ఆ రోజు పత్రికలలో అచ్చయిన కొన్ని ఫొటోగ్రాఫ్‌ల బట్టే తెలుసుకో గలిగారు. యాకూబ్ మెమన్‌కు నమాజ్ చేయడానికి ముంబైలో దాదాపు 8 వేల మంది ముస్లింలు హాజరయ్యారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నివేదించింది. మన ప్రశ్న అల్లా ఏమిటంటే... వారెందుకలా చేశారు? అన్నదే.
 
 భారతీయ జనతా పార్టీ నేత, త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ దీనిపై తనదైన సూత్రీకరణ చేశారు. ‘యాకూబ్ మెమన్ భౌతికకాయం వద్ద గుమిగూడిన వారం దరిపై (కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులను మినహాయించి) నిఘా శాఖ ఓ కన్నేసి ఉంచాలి. వీరిలో చాలామంది భవిష్యత్తులో ఉగ్రవాదులుగా మారే ప్రమాదముంది’.
 
 అయితే మెమన్‌కు చివరి నివాళి అర్పించడానికి దూరప్రాంతాల నుంచి కూడా జనం వచ్చారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అంత్యక్రియల వేదిక వద్ద నుంచి పంపిన వాట్సాప్ సందేశాలు, చివరి నివాళిని అందించిన సమ యాన్ని చూసినట్లయితే యాకూబ్‌కు నివాళి పలకడానికి అతనితో ఏమాత్రం సం బంధం, పరిచయం లేని పలువురు కొత్తవారు వచ్చారని తెలుస్తోందని ఆ పత్రిక పేర్కొంది.
 
 సోషల్ మీడియాలో యాకూబ్ ఉరిపట్ల ఆగ్రహం వెల్లువెత్తిన సమాచారాన్ని సీనియర్ పోలీసు అధికారులు పసిగట్టారని కూడా ఆ పత్రిక నివేదిక తెలిపింది. అయితే పోలీసు కమిషనర్ మాత్రం అక్కడ ఆవేశకావేషాలను రెచ్చగొట్టే ఘట నలు చోటు చేసుకోలేదన్న వాస్తవాన్నీ అంగీకరించినట్లు ఆ వార్త బయటపెట్టింది. శ్మశాన వాటిక వద్ద గుమిగూడిన ప్రజలను ఎలాంటి నినాదాలూ చేయవద్దని కూడా కోరడమైంది.
 
 తమ నిరసన తెలుపడానికి అక్కడ అంతమంది గుమిగూడనట్లయితే, మీడి యాలో తీవ్ర వ్యతిరేకత, పోలీసు నిఘా ఉన్నప్పటికీ అంతమంది జనం అక్కడికి ఎలా రాగలిగారు? ఎలాంటి దురభిప్రాయాలకూ, మీడియా వర్ణనలతో ముం దస్తు అభిప్రాయాలకూ లోనుకాకుండా మనం ఘటనలను చూడగలిగితే, దీన్ని అర్థం చేసుకోవడం సులభమే. ఈ అర్థంలో గతంలో జరిగిన వరుస ఘటనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి.
 
 మెమన్ ఉరితీతకు దారితీసిన ముంబై పేలుళ్లు 1993 మార్చి 12న జరి గాయి. అదే సంవత్సరం జనవరిలో ముంబైలో జరిగిన ఘర్షణల్లో 500 మంది ముస్లింలు (200 మంది హిందువులు) హత్యకు గురయ్యారు. దానికి నెల రోజు లకు ముందు బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ లేవనెత్తిన ఉద్యమం ఆ మసీదు కూల్చివేతకు కారణమైంది.
 ఈ అర్థంలో అనేక ఘటనల సమాహార ఫలితమే ముంబై పేలుళ్ల ఘటనకు దారితీసింది. ఇది హింసను ప్రేరే పించి మతపరమైన సామాజిక బృందాలు భారీ స్థాయిలో పాలుపంచుకోవడానికి కారణమైంది. ఈ ఘటనలో హతులైనవారితో పాటు, తమ వ్యాపారాలను కోల్పోయినవారు, గాయపడినవారు, అత్యాచారా లకు గురైనవారు. నిరాశ్రయుల సంఖ్యను కూడా కలపాల్సి ఉంది. వీరందరి సంఖ్య వేల సంఖ్యలో ఉంటుంది.
 
 ముంబై పేలుళ్ల నేపథ్యం ఇదే. మెమన్ ఉరితీత కూడా ప్రజలను వేరుపర్చేదే. ఇది కూడా పెద్ద స్థాయిలో విషం చిమ్మనుంది. ఈలోగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఉరిశిక్షకు గురైనవారిలో 94 శాతం మంది దళితులు లేదా ముస్లింలేనట.
 
 తమ మతం కారణంగానే తాము ఈ దేశంలో శిక్షకు గురవుతున్నట్లు ముస్లిం లలో అనేకమంది భావిస్తున్నారన్న భావనను యాకూబ్ మెమన్ ఉరి ఘటన బలపరుస్తోంది. మెమన్ నిజంగా తప్పు చేసినప్పటికీ, తన మతం కారణంగానే అతడిని ఉరితీయడానికి ప్రభుత్వం అంత ఆత్రుతను ప్రదర్శించిందన్న ముస్లింల ఆవేదనను ఇది స్పష్టం చేస్తోంది. ఈ కేసు విషయంలో సానుభూతి పూర్తిగా లోపించడాన్ని బీజేపీకి చెందిన హంతకులు మాయా కొడ్నాని, బాబూ బజరంగీల కేసుతో పోల్చితే స్పష్టమవుతుంది. వీళ్లిద్దరికి కూడా ఇదే స్థాయి తీవ్రనేరాలకు గాను శిక్ష విధించినప్పటికీ, వారు నిక్షేపంగా బెయిల్‌పై బయటకు వచ్చారు.
 
 ఇప్పుడు భారత్‌లో ముస్లింల మనుగడకు సంబంధించిన పెనువాస్తవం మనకు ఎదురవుతోంది. ఉగ్రవాదానికి సంబంధించిందే కాదు.. ముస్లింల విద్రోహ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై వస్తున్న ఏ వ్యాసం కింద అయినా ఇంటర్నెట్‌లో పాఠకుల వ్యాఖ్యల కేసి చూస్తే మనందరికీ కాస్త జ్ఞాన బోధ కలుగుతుంది. ఆంగ్లీకరణకు గురైన మన మధ్యతరగతి ప్రజల్లో మతద్వేషం, మతపరమైన దురభిమానానికి సంబంధించిన భావనలు ఎంత బలంగా ఉన్నా యంటే ఆ వ్యాఖ్యలను చూస్తుంటే నిజంగానే భయం కలుగుతోంది. దీని ఫలి తంగా కిరాయి ఇళ్ల కోసం, ఉద్యోగాల కోసం మన దేశంలో ముస్లింలు ఎదు ర్కొంటున్న కష్టాలను పరిశీలించడం కూడా కష్టమైపోతోంది.


 భారత్‌లో ముస్లింగా బతకడంలో ఉన్న వాస్తవం ఇదే. మన కళ్లముందు అనేక ఘటనలు జరుగుతుంటాయి. యాకూబ్ మెమన్ ఉరితీత వాటిలో ఒకటి. అతడి అంత్యక్రియలకు హాజరైనవారి ముఖాల్లో వారికెదురవుతున్న అన్యాయాలు స్ఫుటం దాల్చినట్లు కనిపించాయి. ఆ శ్మశానంలో హాజరైన వారు నిరసన తెలుపడానికి రాలేదు. తామూ బాధితులే కాబట్టి వారు సానుభూతి తెలుపడానికి అక్కడికి వచ్చారు.
 (ఆకార్ పటేల్ , వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com

 

Advertisement
Advertisement