ఆర్మీ ఎంపికలకుఅవరోధం

7 Oct, 2017 09:38 IST|Sakshi

విజయనగరం రూరల్‌: భారత్‌ సైన్యంలో నాలుగు విభాగాల్లో ఎంపికల కోసం శుక్రవారం చేపట్టిన భారీ ర్యాలీకి వరుణుడు అడ్డంకిగా మారాడు. దేశ రక్షణ రంగంలో ప్రవేశించాలన్న యువత ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు విజయనగరం రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మైదానం చిత్తడి మారింది. రన్నింగ్‌ ట్రాక్‌ సరిగా లేకపోవడంతో అనివార్యంగా ఎంపికలను వాయిదా వేశారు. ఆర్మీ ర్యాలీకి ఆరు జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరుకాగా శుక్రవారం వేకువజామునుండే పరుగుపందెం పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభానికి ముందే పట్టణంలో భారీ వర్షం కురిసింది. ర్యాలీకి హాజరైన అభ్యర్థులు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రాజీవ్‌క్రీడా మైదానం సమీపంలో వర్షంలోనే తడుస్తూ ఉన్నారు.

బురదలోనే పరుగు
వర్షం నీటితో 16 వందల మీటర్ల పరుగుపందెంలో 400 మీటర్ల రన్నింగ్‌ట్రాక్‌ చిత్తడిగా మారిపోయింది. శుక్రవారం వేకువజామున నిర్వహించిన పరుగుపందెం మొదటి విడత పోటీల్లో 300 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. రన్నింగ్‌ట్రాక్‌ చిత్తడిగా మారడంతో మొదటి విడతలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. రెం డోసారి పరుగుపందెం నిర్వహించే సమయానికి భారీ వర్షం కురవడంతో రన్నింగ్‌ట్రాక్‌ మొత్తం బురదగా మా రిపోయింది. దీంతో 300 మంది అభ్యర్థులు పరుగుపెట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్దేశించిన సమయానికి అభ్యర్థులు ఎవరూ పరుగు పూర్తి చేయకపోవడంతో ఒక్కరూ అర్హత సాధించలేదు. మూడో విడత ప రుగు పందెం నిర్వహించిన సమయానికి వర్షం ఏకధారగా కురవడంతో వర్షం, బురదలోనే అభ్యర్థులు పరుగుపందెంలో పాల్గొన్నారు. దీంతో ఒకే ఒక్కడు అర్హత సాధించారు.

పరిశీలించిన జేసీ–2
రాజీవ్‌ క్రీడా మైదానంలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీని శుక్రవారం ఉదయం ఆరుగంటలకు జేసీ–2 నాగేశ్వరరావు పరిశీలించారు. అభ్యర్థులు బురద, వర్షం నీటిలో పరిగెత్తడానికి పడుతున్న అవస్థలను ఆయన స్వయంగా పరిశీలించారు. అభ్యర్థుల అవస్థలపై ఆర్మీ అధికారులు, జేసీ–2 నాగేశ్వరరావు చర్చించి ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. వెంటనే వారు వాయిదాకు అనుమతినివ్వడంతో ర్యాలీని తొలుత రెండు నెలలపాటు వా యిదా వేస్తున్నట్లు ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (రిక్రూట్‌మెంట్‌) వై.ఎస్‌.శంకియాన్, జేసీ–2 నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. కానీ రన్నింగ్‌ ట్రాక్‌కు సాయంత్రానికి మరమ్మతులు చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ కలుగజేసుకుని శనివారం మ రోసారి ట్రాక్‌ పరిశీలించిన తరువాత ఎప్పుడు ఎంపికలు నిర్వహించేదీ ప్రకటిస్తామని, పరిస్థితులు అనుకూలి స్తే యధావిథిగా ఎంపికలు కొనసాగిస్తామని వెల్లడించారు.

నిరుత్సాహంగా అభ్యర్థులు
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ వాయిదా పడటంతో దూర ప్రాంతాలనుంచి రెండురోజుల క్రితం వచ్చి రాత్రంతా వేచిఉన్న అభ్యర్థులు నిరుత్సాహపడ్డారు. ఎన్నో రోజులపాటు సాధన చేసి ఆఖరి సమయం వచ్చే సరికి వాయిదా పడిందనడంతో ఆవేదన చెందారు.

బురదమట్టితోనే అవస్థలు
రాజీవ్‌ క్రీడా మైదానం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సిద్ధం చేయడానికి రన్నింగ్‌ ట్రాక్‌ను ఎర్రమట్టి, గ్రావెల్‌ పౌడర్‌తో కప్పి చదును చేశారు. వారం రోజులుగా మైదానం సిద్ధం చేసినా ఆఖరి రెండు రోజుల్లో రన్నింగ్‌ ట్రాక్‌ చదును చేసే సమయంలో వర్షం కురవడంతో ట్రాక్‌ చదును కొంత అసంపూర్తిగా ఉండిపోయిందని అధికారులే తెలిపారు. దీంతో భారీ వర్షంతో ఎర్రమట్టి బురదగా మారిపోవడంతో అభ్యర్థులు పరిగెత్తడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ జారిపడి గాయాలపాలవుతామోనని అనేకమంది నాలుగు రౌండ్ల పోటీలో ఒకటి, రెండ్లు పరిగెత్తి ఆగిపోయారు. బురద, వర్షం నీటిలో పరుగుపందెం నిర్వహించడంతో పరిగెత్తలేక అనేకమంది అభ్యర్థులు పరుగు మధ్యలోనే ఆపేయగా నలు గురు అభ్యర్థులు పరిగెత్తలేక సొమ్మసిల్లి పడిపోయారు. వీరికి వైద్యాధికారులు సేవలు అందించారు. క్రీడా మైదానంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (రిక్రూట్‌మెంట్‌) వైఎస్‌ శంకియాన్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు