-

Delhi Weather Update: ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం!

28 Nov, 2023 07:07 IST|Sakshi

దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం బలమైన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇటువంటి ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో 16 విమానాలను దారి మళ్లించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు వెల్లడించారు. 

ఈ విమానాలను సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మళ్లించినట్లు ఆ అధికారి తెలిపారు. జైపూర్‌కు పది, లక్నోకు మూడు, అమృత్‌సర్‌కు రెండు, అహ్మదాబాద్‌కు ఒక విమానాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఐదు ఎయిర్ ఇండియా విమానాలను ఇతర ప్రాంతాలకు పంపినట్లు మరో అధికారి తెలిపారు. వీటిలో సిడ్నీ నుంచి వస్తున్న విమానాన్ని జైపూర్‌కు పంపించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం, విమాన ట్రాఫిక్ కారణంగా గౌహతి నుండి ఢిల్లీకి విస్తారా విమానం యూకే 742ను జైపూర్‌కు మళ్లించినట్లు ఆ సంస్థ మీడియాకు తెలిపింది. 

ఢిల్లీ విమానాశ్రయంలో విమాన ట్రాఫిక్ కారణంగా విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఇండిగో ఎయిర్‌లైన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెలియజేసింది. విమాన ప్రయాణికులు సహాయం కోసం తమ అధికారులను సంప్రదించాలని తెలియజేసింది. కాగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఢిల్లీలో కాలుష్యం కొంతమేర తగ్గవచ్చని అంచనా. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం కారణంగా ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. మంగళవారం ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి తెలిపారు.
ఇది కూడా చదవండి: గుజరాత్‌లో అకాల వర్షాలు..
 

మరిన్ని వార్తలు