అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు

24 Nov, 2016 02:17 IST|Sakshi
అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు

- సీట్లు పెంచాలంటే ఆర్టికల్ 170ని సవరించాల్సిందే
- 2026 జనాభా లెక్కల తరువాతే అవకాశం
- రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

 సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో సభ్యుడు టి.జి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ ఈమేరకు సమాధానమిచ్చారు. ’ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? వస్తే సంబంధిత వివరాలు వెల్లడించండి.

ఈ విషయంలో కేంద్రం స్పందన ఏంటి?’ అంటూ ఎంపీ టి.జి.వెంకటేశ్ రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ ’ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞాపన వచ్చింది. ఈ అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. న్యాయ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తరువాత చేసే తొలి జన గణన ప్రచురించేంతవరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య సర్దుబాటు చేయడం కుదరదని అటార్నీ జనరల్ తన అభిప్రాయం తెలిపారు. అందువల్ల ఆర్టికల్ 170ని సవరించకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదు..’ అని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు