ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురూ 

20 Dec, 2023 05:21 IST|Sakshi

పథకంపైనా విస్తృత ప్రచారం 

అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 

ప్రజల స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌ల డౌన్‌లోడ్‌  

అదే సమయంలో ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరిస్తున్న సిబ్బంది 

ప్రజారోగ్యానికి సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట : మంత్రి విడదల రజిని 

సాక్షి, అమరావతి/పట్నంబజార్‌ (గుంటూరు) : పేద, మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారం పడకుండా సీఎం జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రచార కార్యక్రమంతో పాటు కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకం కింద వైద్యఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.

దీంతో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్‌కార్డులను అందజేస్తూ, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతిఒక్కరికీ వివరించే ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ ప్రచార, స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో వార్డులు/డివిజన్లలో ప్రచారం, కార్డుల పంపిణీ చేపట్టారు. సరికొత్త ఫీచర్లతో 1.48 కోట్ల స్మార్ట్‌కార్డులను వైద్యశాఖ ముద్రించింది.  

ఇంటింటికీ వెళ్లి అవగాహన.. 
కుటుంబంలో ఎవరికైనా దురదృష్టవశాత్తు జబ్బుచేసినా, ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందడం ఎలా అనేదానిపై ప్రజాప్రతినిధులు, ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓ, వలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొసీజర్లను 1,059 నుంచి 3,257కు పెంచడం, ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు ఇలా పథకం ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలియజేశారు.

ప్రజలు సులువుగా పథకం సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ యాప్‌ను రూపొందించింది. దీనిని ప్రతి ఇంటిలో మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయించి, కుటుంబ సభ్యుల ఐడీ ద్వారా లాగిన్‌ చేయించి వినియోగంపై అవగాహన కలి్పంచారు. యాప్‌లో లాగిన్‌ కావడం ద్వారా పథకం కింద అందే వైద్యసేవలు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, గతంలో పొందిన చికిత్సల వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓలు ప్రజలకు వివరించారు.

పథకం కింద సేవలు పొందడంలో ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే ‘104’ ఫోన్‌ను ఎలా సంప్రదించాలన్న దానిపైనా అవగాహన కలి్పంచారు. ఇక పనిలో పనిగా ఇప్పటివరకూ దిశ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోని యువతులు, మహిళలు ఉన్నట్లైతే వారి ఫోన్లలో కూడా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి, అత్యవసర సమయంలో యాప్‌ ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు.   

ఆరోగ్యశ్రీకి ఏటా రూ.4వేల కోట్లు : మంత్రి రజిని 
కాగా, ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి రోగాలకు చికిత్స లభిస్తుంది,  సందేహాలను నివృత్తి చేస్తూ ప్రచురించిన పోస్టర్లను గుంటూరులో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని ఆవిష్కరించి ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలుచేశారన్నారు. వచ్చే జనవరి 1 నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ సెకండ్‌ ఫేజ్‌ కార్యక్రమాన్ని చేపట్టేందుకు దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.

సీఎం జగన్‌ బాధ్యతలు చేపట్టాక ప్రతిఏటా రూ.4వేల కోట్లు చొప్పున ఆరోగ్యశ్రీకి కేటాయించారని.. విలేజ్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లతో పాటు వైద్యానికి సంబంధించి రూ.17వేల కోట్లతో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అలాగే, వైద్య విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 53 వేల పోస్టులను భర్తీచేశారన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటుచేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ, జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు