హైవేపై ఆటోలు నిషేధం

2 May, 2018 06:57 IST|Sakshi

అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు

జాతీయ రహదారిపై ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించినట్లు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు మంగళవారం ప్రకటించారు. ఇక నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాలు సర్వీసు రోడ్డులో మాత్రమే ప్రయాణించాలని స్పష్టంచేశారు.

గుంటూరు: జాతీయ రహదారిపై ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించినట్లు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు మంగళవారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కావున ఆటోలు, ద్విచక్రవాహనాలు సర్వీసు రోడ్డులో మాత్రమే ప్రయాణించాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్‌ వాడటం, ఆటో డ్రైవర్లు పరిమితికి లోబడి ప్రయాణీకులను ఎక్కించుకోవాలని సూచించారు. గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే 57 ఆటోలు ప్రమాదాలకు గురి కాగా, వాటిలో ప్రయాణిస్తున్న 16 మంది మృతి చెందారని, 69 మంది గాయాల పాలయ్యారని చెప్పారు. అదే విధంగా ద్విచక్రవాహనదారులు 147 మంది ప్రమాదాల బారిన పడగా 72 మంది మృతి చెందగా, 124 మంది గాయాలపాలయ్యారని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, హెచ్చరిక పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. 

నేటి నుంచి పోలీస్‌ యాక్ట్‌–30 అమలు
గుంటూరు: మే 2వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు పోలీస్‌యాక్ట్‌–30 అమల్లో ఉంటుందని అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు సోమవారం తెలిపారు. అర్బన్‌ జిల్లా పరిధిలో ఎలాంటి బహిరంగ సభలు, ధర్నా నిరసన దీక్షలు పూర్తిగా నిషేధమని చెప్పారు. కార్మిక, విద్యార్థి, ప్రజా, కుల సంఘాల ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాల కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు అధికారులకు, సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. కావున ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. 

మరిన్ని వార్తలు