బురిడీ బాబా అరెస్టు

23 Aug, 2014 03:31 IST|Sakshi
బురిడీ బాబా అరెస్టు
  •     రూ.80 లక్షల  నగదు స్వాధీనం
  •      కారు, రెండు ద్విచక్ర వాహనాల పట్టివేత
  • తిరుపతి క్రైం: లక్ష్మీపూజతో మీ దగ్గర ఉన్న డబ్బును రెండింతలు చేస్తానంటూ బురిడీ కొట్టిస్తూ నమ్మిన వారి సొమ్మును స్వాహా చేసే దొంగ స్వామీజీని తిరుపతి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  32 ఏళ్ల వయస్సున్న బుడ్డప్పగారి శివ అలియాస్ సూర్యా అలియాస్ స్వామి  తన వద్ద అత్యంత శక్తులు ఉన్నాయంటూ ప్రజలను నమ్మించే వాడు. పూజా క్రమంలో ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి డబ్బులతో ఉడాయించే వాడు.

    బురిడీ బాబా ఆట కట్టించేందుకు పోలీసులు పట్టిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కరకంబాడి రోడ్డులోని కృష్ణారెడ్డి కోళ్ల ఫారం వద్ద అలిపిరి సీఐ రాజశేఖర్ తన సిబ్బంది, క్రైమ్ సిబ్బందితో పకడ్బందీగా కాపుకాచి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నకిలీ స్వామి అనేక మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. తిరుపతి ఆటోనగర్‌లో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారి అయిన ఆర్‌కే.యాదవ్ ఇంట్లో వారిని నమ్మించాడు. రూ.63 లక్షల 43 వేల 500ను పూజలో పెట్టగా పూజ అనంతరం వారికి మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని తినిపించాడు.

    వారు మత్తులో పడిపోగానే నగదుతో ఉడాయించాడు.  ఈ మేరకు ఈ ఏడా ది జూన్ 21వ తేదీ అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి.  బురిడీ బాబా సొంతవూరు కుప్పం మండలం వెండుగాంపల్లె. ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో నిలిపేశాడు. బాబా తొలుత ఇంట్లో డబ్బులు ఎత్తుకొని తిరుపతి, బెంగళూరు, కేరళకు వెళ్లి పలు ఆశ్రమాల్లో స్వామి వద్ద నుంచి ప్రజలను మోసగించే పద్ధతిని నేర్చుకున్నాడు.

    ఈ క్రమంలో 2007లో పలువురిని మోసం చేసి సుమారు రూ. 3 కోట్ల వరకు సంపాదించాడు. ఇతనిపై కర్ణాటక రాష్ట్రం కోలార్ టౌన్ పీఎస్‌లో, కోలార్ రూరల్, హోస్కోట, హన్నూరు, కమ్మలగూడ, హైదరాబాద్, కేబీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ల్‌లో కేసులు నమోదయ్యాయి. బెయిలుపై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. అనంతరం తిరుపతికి వచ్చి యాదవ్‌ను మోసగించాడు. అదేవిధంగా నెల్లూరులోని ఆనందరెడ్డి ఇంట్లో పూజ చేసి 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు.

    ఈ 40 లక్షలతో ఒక ఇన్నోవా కారు, ఒక హోండా యాక్టీవా, ఒక హోండా షైన్ మోటార్ సైకిలు కొన్నాడు. తిరుపతిలో నకిలీ స్వామికి సహకరించిన దామోదర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా శివ అలియాస్ స్వామి చెప్పినవ్నీ వాస్తవాలే అని పోలీసులకు తెలిపాడు. ఈ సమావేశంలో డీఎస్పీ రవిశంకర్, అలిపిరి సీఐ రాజశేఖర్, ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది ఉన్నారు.
     

మరిన్ని వార్తలు