అన్నదాతలపై బ్యాంక్‌ అధికారుల కక్షసాధింపు!

28 May, 2018 10:41 IST|Sakshi
రైతులతో చర్చిస్తున్న బ్యాంక్‌ అధికారులు

నిల్వ ఉంచిన నువ్వులు అక్రమ తరలింపు 

రైతులకు తెలియకుండా అమ్మకం

చిలకలూరిపేట రూరల్‌:  ఆరుగాలం పండించిన పంటను బ్యాంక్‌కు కుదువ(హామీ)గా ఉంచి రుణాన్ని తీసుకున్నా, బ్యాంక్‌ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి నిల్వ ఉన్న సరుకుని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని కోల్డ్‌ స్టోరేజ్‌లో ఆదివారం రైతులు, బ్యాంక్‌ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ చేసుకున్న నువ్వుల పంటను రైతులకు తెలియకుండా బ్యాంక్‌ అధికారులు గోప్యంగా వేలం వేసి కోల్డ్‌ స్టోరేజ్‌ నుంచి రవాణా చేయటంతో సమాచారం తెసుకున్న రైతులు స్టోరేజ్‌ వద్దకు చేరుకున్నారు. ఇదేమని ప్రశ్నించటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఆక్షన్‌ నిర్వహించి బిడ్‌ చేసిన వారికి సరుకు అందించామన్నారు. రైతులు బ్యాంక్‌ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు విషయం ఇది..
ముప్పాళ్ల మండలం కందూరివారిపాలెం గ్రామానికి చెందిన 25 మంది రైతులు 2016లో నువ్వులు సాగు చేయగా 10,125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు స్థానిక బొప్పూడి కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ చేశారు. పంట హామీతో నరసరావుపేటలోని కరూర్‌ వైశ్య బ్యాంక్‌లో రుణాలు తీసుకున్నారు. ఐదుగురు రైతులు రూ.84.80 లక్షలు రుణం పొంది ఇప్పటి వరకు రూ.98.10 లక్షలు చెల్లించారు. 20 మంది రూ. 4.37 కోట్లు రుణం తీసుకుని నేటి వరకు రూ. 66.10 లక్షలు చెల్లించారు. మొత్తం 25 మంది రూ.5. 22 కోట్లుకు రూ. 1.64 కోట్లు వాయిదాల రూపంలో చెల్లించారు. బ్యాంక్‌ అధికారులు రైతులకు సమాచారం అందించకుండా 1,941 క్వింటాళ్ల (2,754 బ్యాగులుకు చెందిన) నువ్వులకు ఆన్‌లైన్‌లో ఈ ఆక్షన్‌ నిర్వహించారు.

బ్యాంక్‌ ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు రెండు మాసాలు గడువు ఇవ్వాలని రైతులు కందుల జగన్నాథం, కె.వెంకటేశ్వర్లు, శీలం సుబ్బారెడ్డి, రావిపాటి వెంకటేశ్వరావు, ఆంజనేయులు, పూర్ణయ్య, నాగేశ్వరరావు, వీరభద్రరావు, చంద్రశేఖర్, నారాయణ, పెద్దన్న, మధుబాబు, రామారావు, వీరయ్య, రామిరెడ్డి, బ్రహ్మానందం, లింగేశ్వరరావు తదితరులు బ్యాంక్‌ అధికారులకు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ బి.గోవర్థన్‌ మాట్లాడుతూ రుణాల చెల్లింపునకు ఆరుమాసాల గడువు మాత్రమే ఇచ్చామన్నారు. సకాలంలో వడ్డీలు, అసలు పూర్తి స్థాయిలో చెల్లించక పోవటంతో కొంతమంది రైతులకు చెందిన 194 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఈ ఆక్షన్‌ నిర్వహించి వాటిని స్టోరేజ్‌ నుంచి రిలీజ్‌ చేయమని ఆదేశాలు ఇచ్చామని బ్యాంక్‌ మేనేజర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు