బీసీ రుణాలకు ‘లాక్’

21 Feb, 2016 03:49 IST|Sakshi
బీసీ రుణాలకు ‘లాక్’

అప్‌లోడ్ కాని 3 వేల మంది దరఖాస్తులు
2015-16 ఆర్థిక సంవత్సరంలో నెరవేరని లక్ష్యం
బ్యాంకర్లు సహకరించినా ఫలితం శూన్యం

 
కర్నూలు(అర్బన్):జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన రుణాలకు ‘లాక్ ’ పడింది. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం నెరవేరని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆర్థిక   సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 5,940 మందికి రూ.16 కోట్ల మేర రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని 5209 మందికి, మున్సిపల్ ప్రాంతాల్లోని 731 మందికి రుణాలు అందించాల్సి ఉంది. అయితే లబ్ధిదారుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని తాజాగా రూ.5.80 కోట్లకు సవరించారు. సవరించిన లక్ష్యం మేరకు రూ.5.80 కోట్లను 1694 మందికి మాత్రమే సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు వీరికి మాత్రమే రుణ మంజూరు ఉత్తర్వులను అందించనున్నారు.

దాదాపు 3 వేలకు పైగా లబ్ధిదారులకు రుణాలు మంజూరైనా, సబ్సిడీ కోసం వారి బ్యాంకు ఖాతా నెంబర్లను అప్‌లోడ్ చేసేందుకు వీలు లేని పరిస్థితి నెలకొనింది. హైదరాబాద్ ఉన్నతాధికారి కార్యాలయంలో అప్‌లోడ్ చేసేందుకు ఫ్రీజింగ్ విధించిన కారణంగా బ్యాంకు ఖాతా నంబర్లు అప్‌లోడ్ కావడం లేదు. మూడు వేల మంది దరఖాస్తులు అప్‌లోడ్ కాకపోవడం, లక్ష్యానికి సంబంధించి 1246 దరఖాస్తులు మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.
 
బ్యాంకర్లు సహకరించినా ....
ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా తమ సహకారాన్ని అందించి రుణాలు అందించేందుకు అర్హులైన వారికి అంగీకార పత్రాలను కూడా అందించారు. అయినా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిన కారణంగా సబ్సిడీ రుణాలు అందని పరిస్థితి నెలకొనింది. ఫ్రీజింగ్ తొలగించకుంటే ... ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా మందికి రుణాలు విడుదల కావు.

మరిన్ని వార్తలు