అన్యాయంగా పింఛన్లు తీసేశారు

21 Oct, 2014 03:02 IST|Sakshi
అన్యాయంగా పింఛన్లు తీసేశారు

కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన బాధితులు

 కర్నూలు(అగ్రికల్చర్):
 తాము అన్ని రకాలుగా పింఛన్లకు అర్హులమైనా అన్యాయంగా జాబితా నుంచి పేర్లు తొలగించారని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.05 లక్షల మందికి పింఛన్లు కట్ కావడంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం పింఛన్లు కోల్పోయిన వారు తమ గోడును కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు.

కలెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను బయటకు తీసుకువచ్చారు. ప్రజాదర్బార్ ఉంటుందనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచి పింఛన్ బాధితులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రజాదర్బార్ బంద్ కావడం,  సుదూర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చినా వారి గోడును పట్టించుకునేవారు లేకపోవడంతో ధర్నాకు దిగారు.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌లో పింఛన్లను పెంచినట్లే పెంచి అడ్డుగోలుగా కోత కోశారు. ఆధార్ లేదని, ఆధార్ ఉన్నా తప్పులున్నాయని, రేషన్ కార్డు లేదని, పింఛన్‌కు  తగిన వయస్సు లేదని, భూమి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందని, ఇలా పలు కారణాలతో 1.05 లక్షల పైగా పింఛన్లను తొలగించారు. దీంతో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

మరిన్ని వార్తలు