సాయుధ దళాల త్యాగనిరతి నిరుపమానం

7 Dec, 2019 04:20 IST|Sakshi
మాట్లాడుతున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

సాక్షి, అమరావతి: సాయుధ దళాల సాహసం, త్యాగనిరతే మన సమాజానికి, దేశానికి రక్షా కవచాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. డిసెంబర్‌ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశ ప్రజల గుండెల్లో సాయుధ దళాలకు ప్రత్యేక స్థానముందన్నారు. దేశ సరిహద్దులను కాపాడటమే కాకుండా ప్రకృతివిపత్తుల సమయంలో సహాయక చర్యల్లో నిరుపమాన సేవ అందిస్తున్నాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల్లో అమరులైన జవానులు.. పి.జైపాల్‌రెడ్డి (అనంతపురం జిల్లా) భార్య పి.లక్ష్మీరెడ్డి, రామకృష్ణారెడ్డి (గుంటూరు జిల్లా) భార్య పి.సావిత్రి రెడ్డిలను గవర్నర్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ, సైనికసంక్షేమ డైరెక్టర్‌ కమాండెంట్‌ ఎంవీఎస్‌ కుమార్, గవర్నర్‌ కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా తదితరులు పాల్గొన్నారు. 

రక్తదానం పట్ల మరింత అవగాహన కల్పించాలి
రక్తదానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 13వ రక్తదాన దినోత్సవాన్ని విజయవాడలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశం రక్త నిల్వల కొరతను ఎదుర్కొంటూ ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రతి రెండు సెకన్లను ఒకరికి రక్తం అవసరమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు