కమలంతో దోస్తీకి సైకిల్ సై

13 Mar, 2014 01:18 IST|Sakshi
 భీమవరం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కమలంతో దోస్తీ కట్టేందుకు సైకిల్ సై అంటోంది. ఒక పక్క రాష్ట్ర విభజనలో కమలనాథులే ప్రధాన భూమిక పోషించారంటూ గొంతెత్తి అరిచిన తెలుగు తమ్ముళ్లు చీకటి ఒప్పందంతో బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌తో కలసి కుట్ర పూరితంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించిన కమలనాథులు, రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించిన టీడీపీ తొలుత ప్రజల వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని భావించినప్పటికీ ప్రస్తుతం అవేమి తమకు అడ్డు కాదంటూ బరితెగించి మరీ కమల దండుతో కలిసి రానున్న ఎన్నికల్లో జతకడుతుండడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ అనుకోని విధంగా వచ్చిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిలో భాగంగా జిల్లాలోని కార్పోరేషన్, మునిసిపాలిటీల్లో సీట్లు సర్దుబాటు కోసం ఇరు పార్టీల నేతలు ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు. 
 
 రాష్ట్ర స్థాయిలో పొత్తు అధికారికంగా వెల్లడి కానప్పటికీ నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగుస్తుండడంతో వార్డుల సర్దుబాటులో ఇరు పార్టీల నేతలు తలమునకలై ఉన్నారు. జిల్లాలో కీలకమైన భీమవరం, నర్సాపురం వంటి మునిసిపాలిటీల్లో పొత్తులు ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు వంటి మునిసిపాలిటీల్లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. భీమవరం మునిసిపాలిటీలో 10 వార్డులను బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా టీడీపీ నేతలు 5 నుంచి 6 వార్డులు కేటాయించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. గురువారం వీటినే అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉందని టీడీపీ నియోజకవర్గ నేత ఒకరు ‘న్యూస్‌లైన్’ వద్ద ధృవీకరించారు.  
 
మరిన్ని వార్తలు