నాస్‌డాక్‌లో ఇన్ఫీ ఏడీఆర్ పతనం

13 Mar, 2014 01:15 IST|Sakshi
నాస్‌డాక్‌లో ఇన్ఫీ ఏడీఆర్ పతనం

 హైదరాబాద్: అమెరికా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ ‘నాస్‌డాక్’లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ షేరు (ఏడీఆర్...అమెరికన్ డిపాజిటరీ రిసీట్) నిలువునా పతనమైంది. బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి ఈ ఏడీఆర్ భారీ ట్రేడింగ్ పరిమాణంతో 8 శాతానికి పైగా క్షీణించి 54.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధర భారత్‌లో రూ. 3,330తో సమానం. అయితే బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ షేరు రూ.3,671 వద్ద ముగియటం గమనార్హం. దేశీ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిశాక భారత కాలమానం ప్రకారం రాత్రి అమెరికాలో ట్రేడింగ్ మొదలవుతుంది కనక ఆ ప్రభావం దేశీ మార్కెట్లపై ఉండే అవకాశాలెక్కువ. దీంతో గురువారం భారత్ ఎక్స్ఛేంజీల్లో ఇన్ఫోసిస్ రూ. 300 వరకూ తగ్గే అవకాశం ఉందన్నది నిపుణుల మాట. తాము ముందుగా ప్రకటించిన ఆర్థిక అంచనాల్ని చేరడం కష్టమని కంపెనీ యాజమాన్యం ఒక ఇన్వెస్టర్ల సమావేశంలో బాంబు పేల్చడంతో ఈ పతనం సంభవించింది.

గత రెండేళ్లుగా కంపెనీ పనితీరు పట్ల తాను అసంతృప్తి చెందుతున్నానని, కంపెనీ టర్న్ ఎరౌండ్ కావడానికి చాలాకాలమే పట్టవచ్చని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి (2013-14) ఆదాయ వృద్ధి 11.5-12 శాతం వుండవొచ్చని గతంలో కంపెనీ ప్రకటించింది. అయితే తమ క్లయింట్ల వ్యయం ఈ క్వార్టర్లో బలహీనంగా వుందని, ఈ కారణంగా గెడైన్స్‌లో దిగువ శ్రేణిని మాత్రమే చేరవచ్చునని కంపెనీ సీఈఓ శిబూలాల్ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యాపారం మందకొడిగా వుంటుం దని ఆయన మరో బాంబు పేల్చారు. కంపెనీ ఛైర్మన్‌గా నారాయణమూర్తి తిరిగి బాధ్యతలు చేపట్టాక వ్యాపారం పుంజుకుందని చెప్పిన విశ్లేషకులు కంపెనీ తాజా ప్రకటనతో ఖిన్నులయ్యారు.

మరిన్ని వార్తలు